Begin typing your search above and press return to search.

పాక్ ను ఒంటరిని చేసిన మోడీ చాణక్యం

భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు తీవ్రంగా బెడిసికొట్టాయి.

By:  Tupaki Desk   |   6 May 2025 4:05 PM IST
పాక్ ను ఒంటరిని చేసిన మోడీ చాణక్యం
X

భారత్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తీర్మానం చేయించాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు తీవ్రంగా బెడిసికొట్టాయి. భారత్‌-పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించేందుకు పాక్ అభ్యర్థన మేరకు జరిగిన భద్రతా మండలి క్లోజ్డ్-డోర్ సమావేశంలో దాయాది దేశానికే సభ్య దేశాల నుంచి ఊహించని రీతిలో కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో చివరికి గట్టి ఎదురుప్రశ్నలు ఎదురుకావడంతో పాక్ తన ప్రయత్నాలను విరమించుకోవాల్సి వచ్చింది.

దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధి అసీమ్ ఇఫ్తికార్ అహ్మద్ హాజరయ్యారు. అయితే, పాక్ తన సభ్యత్వాన్ని అడ్డంపెట్టుకుని భారత్‌పై వ్యతిరేక తీర్మానం చేయాలని భావించగా, అందుకు భిన్నంగా పరిస్థితి తలెత్తింది. అనేక సభ్య దేశాలు పాకిస్థాన్ బహిరంగ అణు బెదిరింపులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల పాక్ నిర్వహించిన క్షిపణి పరీక్షలు ప్రాంతీయ అస్థిరతకు దారితీస్తాయని, ఉద్రిక్తతలను పెంచుతాయని ప్రశ్నించాయి.

అంతేకాకుండా, పహల్గాం దాడి భారత్ పన్నిన కుట్ర అని, దానిని పాకిస్థాన్‌పై నిందలు మోపడానికి ఉపయోగించుకుందని పాక్ చేసిన వాదనలను సభ్య దేశాలు ఏకగ్రీవంగా తిరస్కరించాయి. ఉగ్రదాడికి పాల్పడిన వారు బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేస్తూ పహల్గాం దాడిలో లష్కరే తోయిబా పాత్రపై ప్రశ్నించాయి. మతం ఆధారంగా అమాయక ప్రజలను ఉగ్రవాదులు చంపడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లి భారత్‌ను ఇరుకున పెట్టాలని పాక్ భావించినప్పటికీ, ఏ ఒక్క దేశం కూడా దానికి మద్దతు పలకలేదు. దీంతో ఎటువంటి తీర్మానం లేకుండానే సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం కనీసం సంయుక్త ప్రెస్ స్టేట్‌మెంట్ ఇవ్వడానికి కూడా చైనా ముందుకు రాలేదు. భారత్‌తో ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని అనేక దేశాలు పాకిస్థాన్‌కు గట్టిగా సూచించాయి.

పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్‌ను అన్ని వైపుల నుంచి ఒత్తిడిలోకి నెట్టేందుకు భారత్ చేపట్టిన దౌత్యపరమైన చర్యలు ఫలించాయని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. ప్రధాని మోడీ ఇప్పటికే భద్రతా మండలిలోని నాలుగు శాశ్వత సభ్య దేశాల నాయకులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఇతర సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతూ, ఉగ్రదాడికి బాధ్యులైన వారిని, కుట్రదారులను కచ్చితంగా శిక్షించాల్సిందేనని గట్టిగా వాదించారు. భారత్ పన్నిన ఈ దౌత్య చాణక్యం పాకిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితిలో ఒంటరిని చేయడంలో విజయవంతమైంది.