Begin typing your search above and press return to search.

'కీలుబొమ్మ'... పాకిస్థాన్ పై ఆ దేశ పౌరులు నిప్పులు!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో విందు ఆరగించిన వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2025 1:55 AM IST
కీలుబొమ్మ... పాకిస్థాన్ పై ఆ దేశ పౌరులు నిప్పులు!
X

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో విందు ఆరగించిన వేళ ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ట్రంప్ ను 2026 నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ నామినేట్ చేసింది. దీంతో... పాకిస్థాన్ పై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు రాగా.. ఇప్పుడు సొంత పౌరులే నిప్పులు చెరుగుతున్నారు.

అవును... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతి - 2026కు నామినేట్ చేయడంపై పాకిస్థాన్ కు ఇంటా బయటా అక్షింతలు పడిపోతున్నాయి! ఈ విషయంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్ పై విమర్శలు, ట్రంప్ పై సెటైర్లు పడుతుండగా.. తాజాగా సొంత పౌరుల నుంచే పాక్ ప్రభుత్వ పెద్దలు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఇందులో భాగంగా... 'గాజాలో జరిగిన జాతి విధ్వంస యుద్ధానికి' మద్దతు ఇచ్చి ఇరాన్‌ పై దాడి చేయాలని యోచిస్తున్న వ్యక్తికి నోబెల్‌ ను సిఫార్సు చేయడం బాధాకరం అని పాకిస్తాన్ జర్నలిస్ట్, రచయిత జాహిద్ హుస్సేన్ అన్నారు. ఇరాన్‌ పై ఇజ్రాయెల్ దాడిని ట్రంప్ 'అద్భుతం' అని అభివర్ణించారని.. అలాంటి వ్యక్తిని పాకిస్తాన్ నోబెల్ బహుమతికి సిఫార్సు చేసిందని మండిపడ్డారు.

ఇదే సమయంలో... పాకిస్థాన్ ప్రభుత్వం ట్రంప్‌ ను నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేయడం దురదృష్టకరమని.. గాజాలో ఇజ్రాయెల్ చేసిన జాతి విధ్వంస యుద్ధానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి ట్రంప్ అని.. ప్రభుత్వ చర్య పాకిస్తాన్ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించడం లేదని గతంలో ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన మలీహా లోధి ట్వీట్ చేశారు.

ఇదే క్రమంలో.. అనేక మంది పాకిస్తాన్ కార్యకర్తలు కూడా ప్రభుత్వాన్ని నిందించారు. ఇందులో భాగంగా.. పాక్ ప్రభుత్వం ‘కీలుబొమ్మ’ పాలన చేస్తుందని.. ప్రపంచం ముందు, దేశ ప్రజల మధ్య 'సున్నా గౌరవం' కలిగి ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా స్పందించిన ఓ కార్యకర్త... పాకిస్థాన్ ఒక అద్దె రాజ్యంగా మిగిలిపోతుందని మరోసారి నిరూపితమైందని అన్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన పాక్ సెనేటర్ అల్లామా రాజా నాసిర్.. అవార్డు నిలబెట్టుకోవాలని ఉద్దేశించిన శాంతి సూత్రాలనే ఇటువంటి నామినేషన్ దెబ్బతీస్తుందని అన్నారు. అంతేకాకుండా, నోబెల్ శాంతి బహుమతి చాలా కాలంగా పాశ్చాత్య సాధనంగా, దాని భౌగోళిక రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడుతోందని విమర్శించారు.

ఇలా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతి - 2026కి నామినేట్ చేసిన పాకిస్థాన్.. ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.