దాయాది దైన్యం : పాక్ లో ఆకలి కేకలు
పాకిస్తాన్ కష్టాలు ఒక్కలా లేవు. ఒక వైపు దాహం దాహం అంటోంది దేశం. సింధూ జలాలు భారత్ నిలుపు చేయడంతో గొంతెండి పోతున్న ప్రాంతాలు పాక్ లో అనేకం ఉన్నాయి.
By: Satya P | 27 April 2026 9:13 AM ISTపాకిస్తాన్ కష్టాలు ఒక్కలా లేవు. ఒక వైపు దాహం దాహం అంటోంది దేశం. సింధూ జలాలు భారత్ నిలుపు చేయడంతో గొంతెండి పోతున్న ప్రాంతాలు పాక్ లో అనేకం ఉన్నాయి. వీటికి తోడు అన్నట్లుగా పెను ఆహార సంక్షోభాన్ని పాక్ ఇపుడు ఎదుర్కొంటోంది. దేశంలో ఏకంగా 1.1 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో సతమతం అవుతున్నారు అని నివేదికలు చెబుతున్నాయి. అంతే కాదు ప్రపంచంలో అతి పెద్ద ఆహార సమస్యను ఎదుర్కొంటున్న టాప్ పది దేశాలలో పాక్ ముందు వరసలో ఉందని 2026 గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్ నివేదిక వెల్లడించింది.
ఆ పరిస్థితులే కారణం :
పాక్ లో ఇంతటి తీవ్రమైన ఆహార సంక్షోభానికి కారణం ఏమిటి అన్నది చూస్తే వాతావరణ ప్రతికూల పరిస్థితులే అని అంటున్నారు. భారీ వర్షాలు ఆకస్మిక వరదలు వంటివి 2025 లో పెద్ద ఎత్తున పాక్ ని నష్టపరచాయని అంటున్నారు. దాంతో ఏకంగా 90 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా ప్రభావితం అయ్యారని చెబుతున్నారు. మరో 17 లక్షల మంది ప్రజలు కటిక దరిద్రంలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద చూస్తే 1.1 కోట్ల మంది ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. పంట పొలాలు దెబ్బ తినడం మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా పాడవడం వల్లనే పాక్ కి ఈ దైన్యం దాపురించింది అని అంటున్నారు. పాక్ లోని బలూచిస్థాన్ సింధ్ ఖైబర్ పఖ్తుంఖ్వాలలో పోషకాహార లోపం పెద్ద ఎత్తున ఏర్పడింది అని నివేదికలు చెబుతున్నాయి.
మరిన్ని కష్టాలతో :
ఇక పాక్ లో ఈ పరిణామాలు అన్నీ కలసి 2026లో ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున పెరుగుతుందని అంటున్నారు. దాంతో మరింత తీవ్రం కానున్న ఆహార కష్టాలు అని కూడా చెబుతున్నారు. ఇక ఈ ఏడాది పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా ఆరు శాతానికి పైగా పెరిగే అవకాశం ఉందని నివేదికలు తెలియచేస్తున్నాయి. దీంతో పాక్ లో ఆహార వ్యవస్థపైన పెను భారంగా ఈ పరిణామాలు ఉండబోతున్నాయని అంటున్నారు. పాక్ లో ఆహార సంక్షోభం అన్నది చాలా సీరియస్ గా ఉందని అక్కడి స్థానిక పత్రికలలో సైతం వార్తా కధనాలు వస్తున్నాయి. మరి దీని నుంచి బయటపడేందుకు పాక్ ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పాక్ ఇది గడ్డు కాలం అని అంటున్నారు. ఒక వైపు గల్ఫ్ యుద్ధం వల్ల ఆర్ధికంగా చితికిపోయింది. మరో వైపు భారత్ తో పెట్టుకున్నందుకు సింధు జలాలకు అడ్డు కట్ట పడింది ఇపుడు తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం. ఇలా పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎలా వీటి నుంచి బయట పడుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు అని అంటున్నారు.
