పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర మూకలు...ప్రపంచానికే ప్రమాదకరంగా !
ప్రపంచంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా దాని మూలాలు మాత్రం పాకిస్థాన్ లో ఉంటాయి. ఉగ్రవాదులకు భూతల స్వర్గంగా పాక్ ఉంది అన్నది అందరికీ తెలిసిందే.
By: Satya P | 29 March 2026 8:15 AM ISTప్రపంచంలో ఎక్కడ ఉగ్ర దాడి జరిగినా దాని మూలాలు మాత్రం పాకిస్థాన్ లో ఉంటాయి. ఉగ్రవాదులకు భూతల స్వర్గంగా పాక్ ఉంది అన్నది అందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశంగా పాక్ కి పేరు ఉంది. అయినా సరే ఈ విషయంలో పాక్ వెనక్కి తగ్గదు ఏ మాత్రం సిగ్గు పడదు తమ వైఖరిని కొనసాగిస్తూనే ఉంటుంది. భారత్ లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే అనేక దాడులు చేసిన ఉగ్ర మూకలకు పాక్ ఆశ్రయం ఇస్తోంది అని అమెరికా కాంగ్రేషనల్ రిసెర్చ్ సర్వీస్ తాజా నివేదిక ఒకటి స్పష్టం చేస్తోంది. భారత్ అనేక ఏళ్ళుగా ఉగ్ర దాడులతో తీవ్రంగా నష్టపోతోంది అని ఆ దాడులకు పాల్పడిన గ్రూపులు మాత్రం పాక్ లో హాయిగా చల్లగా ఉంటున్నాయని ఈ నివేదిక తెలియచేస్తోంది.
అత్యంత ప్రమాదకరం :
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర మూకలు అన్నీ పాక్ లో తిష్ట వేసి కూర్చుకున్నాయని అమెరికా నివేదిక చెబుతోంది. అంతే కాదు ఈ రోజుకీ ఆ ఉగ్ర మూకలు పూర్తి యాక్టివ్ గా ఉంటూ వస్తున్నాయని కూడా స్పష్టం చేస్తోంది. ఈ ఉగ్ర మూకలు తమ లక్ష్యాలను పాక్ నుంచే ఉంటూ చాలా సులువుగా నెరవేర్చుకుంటున్నాయని అలాంటి వాటికి పాక్ అండదండలు అందిస్తోంది అని నివేదిక చెబుతోంది ఈ ఉగ్ర మూకలు భారత్ లో పార్లమెంట్ మీద దాడి చేశాయని అలాగే ముంబై దాడులకు పాల్పడ్డాయని అయినా కూడా వాటిని పెంచి పోషిస్తూ బయటకు మాత్రం ఏమీ ఎరగనట్లుగా పాక్ నంగనాచి కబుర్లు చెబుతోంది అని నివేదిక వెల్లడించింది. కేవలం భారత్ కే కాకుండా ప్రపంచానికే ఈ ఉగ్ర మూకల ప్రమాదం ఉందని కూడా నివేదిక హెచ్చరిస్తోంది. పాక్ తమ దేశంలో ఈ ఉగ్ర మూకలను ఉంచడమే కాదు వాటిని పెంచి పోషిస్తూ నిధులను సమకూరుస్తోందని నివేదిక స్పష్టం చేసింది.
ఉగ్రవాదులకు అడ్డాగా :
పాకిస్థాన్ ఒక దేశంగా ఉంటున్నా కానీ ఉగ్రవాదులకు అడ్డగా మారడం ప్రపంచానికే ప్రమాదకరమని అమెరికా కాంగ్రేషనల్ రిసెర్చ్ సర్వీస్ నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఉగ్ర వాదులకు ఇంతలా సాయం చేసే దేశం ప్రపంచంలో మరొకటి లేదని కూడా నివేదిక చెబుతోంది. ఈ రోజున కూడా పాకిస్థాన్ భూభాగాన్ని యధేచ్చగా వాడుకుంటూ ఉగ్ర మూకలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని నివేదిక చెబుతోంది. ఇక అనేక ఉగ్ర వాద సంస్థలు ఫుల్ యాక్టివ్ మోడ్ లో పనిచేయడం భారత్ కే కాదు ప్రపంచానికే ముప్పు అని నివేదిక హెచ్చరిస్తోంది.
తీరు మారని పాక్ :
ప్రపంచ దేశాల ముందు పాక్ అసలు రూపం బట్ట బయలు అయినా ఎన్నో సార్లు భారత్ ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెట్టినా కూడా పాక్ తీరు మార్చుకోవడం లేదని నివేదిక అంటోంది. అలా భయంకరమైన తీరులో తమ ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తున్న ఉగ్ర సంస్థలలో ముంబైలో దాడులకు పాల్పడిన లష్కరే తొయిబా పాక్ లోనే హాయిగా ఉంది. అలాగే 2001 లో ఏకంగా భారత దేశ పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన జైషే మహమ్మద్ కూడా పాక్ లో తిష్ట వేసి తన కార్యక్రమాలను చురుకుగా చేసుకుని వస్తోంది అని నివేదిక చెబుతోంది.
ఇస్లామిక్ తీవ్రవాదం :
ఈ ఉగ్రవాద సంస్థలకు ఫిలాసఫీ కానీ మూలాలు కనేఎ ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం నుంచే అందుతోంది అని ఈ నివేదిక విశ్లేషిస్తోంది. ఈ విధంగా పాకిస్తాన్ సైతం ఉగ్ర వాదానికి పూర్తిగా ప్రభావితమై ఉందని పేర్కొంటోంది. ఈ ఉగ్రవాదుల లక్ష్యాలు చూస్తే భారత్ లోని కాశ్మీర్ ఇష్యూ నుంచి మొదలెడితే ప్రపంచ వ్యాప్తంగా దాడులు చేయడం, అలాగే మతతత్వాన్ని ప్రేరేపించి ఎటాక్స్ చేయడం వంటివి ఉన్నాయని చెబుతోంది. ఇక పాకిస్థాన్ లో ఈ రోజుకీ ఒక బలమైన ఉగ్ర సంస్థగా ఆల్ ఖైదా ఉంది అని గుర్తు చేస్తున్నారు.
అలాగే ఇల్సామిక్ స్టేట్ కి రీజనల్ గా అనుబంధ సంస్థ అయిన ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ లో ఏకంగా ఆరేడు వేల మంది ఉగ్ర వాదులు ఉన్నారని నివేదిక చెబుతోంది. నిరంతరం ఇక్కడ ఉగ్రవాదులను చేర్చుకుని శిక్షణ ఇస్తూ క్రియాశీలకంగా ఉంటున్నారని అంటోంది. అలాగే తెహ్రిక్-ఇ-తాలిబాన్ అన్నది అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థగా కూడా నివేదిక చెబుతోంది. ఇలా ఒకటీ రెండూ కాదు అనేక బలమైన సంస్థలు ఈ రోజుకీ పాక్ లో ఎంతో దూకుడుగా ఉండడం దేశానికి ప్రమాదమే అని ఈ నివేదిక చెబుతోంది.
