Begin typing your search above and press return to search.

భారత్ పాక్ భారీ వార్...2026 జరిగేది ఇదే !

దాయాది పాకిస్తాన్ మీద భారత్ ప్రయోగించిన ఆపరేషన్ సింధూర్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ దెబ్బకు టోటల్ గా కూసాలు అన్నీ కదిలిపోయి తన ప్లేస్ ఎక్కడో చూసుకుని మరీ మూలన కూర్చుండిపోయింది పాక్

By:  Satya P   |   31 Dec 2025 8:30 AM IST
భారత్ పాక్ భారీ వార్...2026 జరిగేది ఇదే !
X

దాయాది పాకిస్తాన్ మీద భారత్ ప్రయోగించిన ఆపరేషన్ సింధూర్ ప్రయోగం సక్సెస్ అయింది. ఈ దెబ్బకు టోటల్ గా కూసాలు అన్నీ కదిలిపోయి తన ప్లేస్ ఎక్కడో చూసుకుని మరీ మూలన కూర్చుండిపోయింది పాక్. అయినా పగతో రగులుతూనే ఉంది. చాన్స్ దొరికితే భారత్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. కాలాన్ని క్యాలెండర్ లో రోజులుగా లెక్క పెట్టి మరీ ఉగ్గపట్టి చూస్తోంది. మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తరువాత పాక్ నుంచి సౌండ్ అయితే లేదు, ఈ లోగా ఏడు నెలలు ఇట్టే గడచిపోయాయి. ఈ మధ్యలో లేస్తే మనిషిని కాను అన్నట్లుగా పాకిస్థాన్ ప్రకటనలు అయితే ఇస్తూ పోతోంది. వాటిని భారత్ నిశితంగా గమనిస్తూనే ఉంది.

రక్షణ ఒప్పందాలతో :

తాను ఒంటరిగా వస్తే భారత్ తో ఢీ కొనడం కష్టమని పాక్ కి తెలుసు. అందుకే ఈ ఏడాది సెప్టెంబర్ లో సౌదీ ఆరేబియాతో రక్షణ ఒప్పందం చేసుకుంది. ఒక దేశం మీద ఎవరు దాడి చేసినా రెండు దేశాల మీద దాడి జరిగినట్లుగా భావించి రెండు దేశాలు యుద్ధానికి దిగాలన్నది ఈ ఒప్పందంలోని సారాంశం. ఇక్కడ చూస్తే సౌదీ అరేబియా మీద ఎవరూ ఎటాక్ చేసే పరిస్థితి లేదు. పాక్ తన కోసమే ఈ ఒప్పందం కుదుర్చుకుంది అన్నది అందరికీ తెలిసిందే. ఇలా సౌదీతో రక్షణ ఒప్పందం చేసుకుని భారత్ మీద బుసలు కొడుతున్న పాక్ పనిలో పనిగా బంగ్లాదేశ్ తోనూ ఇదే రకమైన ఒప్పందాన్ని చేసుకుంటోంది. దాంతో మూకుమ్మడిగా భారత్ మీద దాడి చేసేందుకు సరైన సమయం కోసం కాచుకుందని దౌత్య నిపుణులు అంటున్న మాట.

ఆ నివేదికలో :

భారత్ పాకిస్తాన్ ల మధ్య ఒక భారీ యుద్ధం 2026 లో జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ టాంక్ తన నివేదికలో తాజాగా వెల్లడించింది. సాయుధ దళాల మధ్య ఘర్షణకు ఆస్కారం ఉందని కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ చెబుతోంది. కొత్త ఏడాదిలో భారత్ పాక్ ల మధ్య ఉగ్రవాదం విషయంలోనే మరోసారి సంఘర్షణలు మొదలవుతాయని కూడా పేర్కొంది. ఈ విషయంలో భారత్ లో ఉగ్రవాద కర్యకలాపాల పెరుగుదల ఉంటుందని కూడా పేర్కొంది.

ఇదే సీజన్ గా :

ఉగ్రవాదులు ఎపుడూ భారత్ లో చొరబడేందుకు చలి వాతావరణాన్ని ఎంచుకుంటారు ప్రస్తుతం చూస్తే కాశ్మీరు లో మంచుతో అంతా కప్పబడి ఉంది. ఈ వణికించే చలిలోనే ఉగ్రమూకలు భారత్ లోకి ప్రవేశించే అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. ఇక జమ్మూలో చూస్తే ఇప్పటికే పాకిస్థాన్ కి చెందిన ముప్పయికి పైగా ఉగ్ర మూకలు క్రియాశీలంగా పనిచేస్తూ తిష్ట వేసి కూర్చున్నట్లుగా భారత్ లోని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇపుడు అత్యంత కఠినమైన పరిస్థితులు కాశ్మీర్ లో ఉన్నా ప్రకృతి సహకరించకపోయినా భారత భద్రతా బలగాలు కాశ్మీరులో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్ ని గట్టిగా నిర్వహిస్తున్నాయి.

రక్షణ కొనుగోళ్లతో :

మరో వైపు చూస్తే అటు పాకిస్థాన్ ఇటు భారత్ కూడా తమ రక్షణ పరికరాలను పెద్ద ఎత్తున పెంచుకుంటున్నాయి. కొత్తగా కొనుగోలు చేస్తున్నాయి. డ్రోన్లు ఎయిర్ టూ ఎయిర్ క్షిపణులు, గైడెడ్ బాంబులను కొనుగోలు చేయడానికి భారత రక్షణ శాఖ ఇటీవల ఏకంగా 80 వేల కోట్లను మంజూరు చేసింది. పాకిస్తాన్ అయితే చైనా నుంచి టర్కీ నుంచి కొత్త డ్రోన్లు, పటిష్టమైన వైమానిక రక్షణ వ్యస్థ కోసం అవసరమైన వాటిని కొనొగోలు చేస్తోంది. ఇవన్నీ చూసినపుడు కచ్చితంగా ఏదో రూపంలో యుద్ధానికి అవకాశం ఉందనే అంటున్నారు. తన పాత బుద్ధిని పాడు బుద్ధిని పాక్ వదులుకోదు, ఆ దేశం భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేవారికి మద్దతు ఇవ్వకుండా మానదు, దాని ఫలితం పర్యవసానంగా భారత్ ఆగ్రహిస్తే యుద్ధం అనివార్యంగా సంభవించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే 2025లో వదిలేసింది 2026లో కొనసాగుతుంది అన్న మాట. సో ఏమి జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది.