Begin typing your search above and press return to search.

దావూద్ తో కలిపి ఏడుగురు.. పాక్ రక్షణలోని భారత్ మోస్ట్ వాంటెడ్స్ వీరే!

ఈ నేపథ్యంలోనే అటు ప్రపంచానికి, ఇటు భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఏడుగురు ఉగ్రవాదులు ఆ దేశంలోనే తలదాచుకుంటున్నారు. వారిని పాక్ కంటికి రెప్పలా కాపాడుతోందని చెబుతారు. వారెవరో ఇప్పుడు చూద్దామ్..!

By:  Tupaki Desk   |   19 July 2025 7:00 PM IST
దావూద్ తో కలిపి ఏడుగురు.. పాక్ రక్షణలోని భారత్ మోస్ట్ వాంటెడ్స్ వీరే!
X

ప్రపంచంలో ఉగ్ర్వాదాన్ని ప్రోత్సహిస్తూ, వారికి ఆశ్రయం కల్పిస్తూ, వారిని తమ అనధికారిక సైన్యంగా చూసే దేశం పాకిస్థాన్ అనే సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అటు ప్రపంచానికి, ఇటు భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఏడుగురు ఉగ్రవాదులు ఆ దేశంలోనే తలదాచుకుంటున్నారు. వారిని పాక్ కంటికి రెప్పలా కాపాడుతోందని చెబుతారు. వారెవరో ఇప్పుడు చూద్దామ్..!

అవును... భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ఘోరాలకు పాల్పడి, వందల మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసిన వారు.. ఎక్కడో అడవుల్లోనో, ప్రపంచానికి కనిపించని శిథిలాల్లోనో, గుహల్లోనో తలదాచుకుంటారని అనుకుంటే పొరపాటే. వారిని సొంత పౌరులుగా ఆశ్రయం కల్పిస్తూ, రక్షణ కల్పిస్తూ రక్షిస్తుంది పాకిస్థాన్. పైకి మాత్రం... తాము కూడా ఉగ్రవాద బాధితులమే అని చెప్పుకుంటుంది.

హఫీజ్ సయీద్:

యునైటెడ్ స్టేట్స్ నావల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం ప్రకారం.. హఫీజ్ సయీద్ 1990ల ప్రారంభంలో పాకిస్తాన్‌ కు చెందిన ఇస్లామిక్ ఛాందసవాద మిషనరీ గ్రూపు అయిన మర్కజ్ ఉద్ దవా-వాల్ ఇర్షాద్ సైనిక విభాగంగా స్థాపించిన లష్కర్ తోయిబా ఉగ్రవాద సంస్థకు అధిపతి. ఈ ఉగ్రసంస్థ భారతదేశంపై జరిపిన దాడులు ఎన్నో ఉన్నాయి!

ఇందులో ప్రధానంగా 2006లో ముంబైలో జరిపిన 26/11 ఘోరం ఒకటి. ఈ ఘటనలో సుమారు 360 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు! అంతకంటే ముందు.. 2000 సంవత్సరంలో ఢిల్లీలోని ఎర్రకోటపై లష్కర్ ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో.. ఈ దాడుల వెనకున్న హఫీజ్ ను అమెరికా, ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించాయి.

ఈ నేపథ్యంలో అతని తలపై $10 మిలియన్ల రివార్డు ఉంది. అయినప్పటికీ ఆ ఉగ్రవాది ఎక్కడో చీకట్లో, ప్రపంచానికి తెలియని ప్రదేశంలో దాక్కొన్నాడంటే పొరపాటే! అతడు సాయుధ రక్షణలో లాహోర్‌ లో హాయిగా నివసిస్తున్నాడు. ఇలాంటి బ్యాచ్ ఇంకా పాక్ లో చాలా మందే ఉన్నారు.

మసూద్ అజార్:

హఫీజ్ అనంతరం పాకిస్తాన్‌ లో స్థిరపడి, ఆదేశ సైన్యం రక్షణలో ఉన్న జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ ఉన్నాడు. పుల్వామా, ఉరి ఉగ్రవాద దాడులకు సూత్రధారి అయిన అజార్‌ ను 2019లో ఐక్యరాజ్యసమితి 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా ప్రకటించింది. ఆ దాడుల్లో సుమారు 59 మంది సైనికులు మరణించగా.. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.

ఈ క్రమంలో గత ఏడాది నవంబర్‌ లో అతడు పాకిస్తాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్‌ లో జరిగిన ఒక ఇస్లామిక్ సెమినరీలో ప్రసంగించాడు. ఈ సందర్భంగా... భారతదేశంపై మరిన్ని ఉగ్రవాద దాడులు చేస్తామని ప్రతిజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో... అతన్ని వెంటనే అరెస్టు చేయాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. కానీ.. అతడి ఆచూకీ గురించిన సమాచారం తమ వద్ద లేదని పాక్ బొంకింది!

జకీర్ రెహ్మాన్ లఖ్వీ:

వీరిద్దరి తర్వాత స్థానంలో జకీర్ రెహ్మాన్ లఖ్వీ ఉన్నాడు. అతడు ఒక ఇస్లామిక్ బోధకుడే కాకుండా లష్కరే తోయిబా లో సీనియర్ వ్యక్తి కూడా! 26/11 ముంబై దాడి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారి ఇతడే అనే నివేదికలు ఉన్నాయి. ఇతడిని పాక్ గతంలో జైలులో పెట్టింది. అనంతరం అతి తక్కువ కాలంలోనే బెయిల్ పై విడుదలయ్యాడు.

ఇతడు 2020 నుండి ఇతర ఉగ్రవాదుల మాదిరిగానే పాక్ లో స్వేచ్ఛగా ఉన్నాడని చెబుతారు. ఈ క్రమంలో... పంజాబ్ ప్రావిన్స్, ఇస్లామాబాద్ లలో ఇతడి అడ్రస్ లు కూడా రికార్డులో ఉన్నాయని అంటారు. అతనికి పాక్ సైన్యంతో పాటు చైనా కూడా రక్షణ కల్పిస్తున్నాయని అంటారు. అతన్ని కీలక ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలనే ఐరాస ప్రయత్నాన్ని బీజింగ్ అడ్డుకుంది!

సయ్యద్ సలావుద్దీన్:

ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు సయ్యద్ సలావుద్దీన్. ఇతడు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు అధిపతి. కాగా.. కాశ్మీర్ లోయను భారత దళాలకు శ్మశానవాటికగా మారుస్తానని ఇతడు ప్రతిజ్ఞ చేశాడు. ఇతడు ఇప్పటికీ పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో భారతదేశ వ్యతిరేక ర్యాలీలకు నాయకత్వం వహిస్తున్నట్లు చెబుతారు.

దావూద్ ఇబ్రహీం:

ఆ తర్వాత స్థానంలో దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. అపఖ్యాతి పాలైన డి-కంపెనీ క్రైమ్ సిండికేట్ అధిపతి, హత్య, కిరాయికి హత్య, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి ఆరోపణలపై వాంటెడ్‌ గా ఉన్న దావూద్ ఇబ్రహీం... ఇప్పటికే కరాచీలో ఫ్యామిలీతోపాటు క్షేమంగా ఉన్నట్లు చెబుతారు. పాక్ మాత్రం తమకు తెలియదు అని అంటుంటుంది!

దశాబ్దం క్రితం ముంబైలో జరిగిన బాంబు దాడుల్లో అతని పాత్రకు గాను 2003లో భారతదేశం, అమెరికా అతన్ని 'గ్లోబల్ టెర్రరిస్ట్'గా ప్రకటించాయి. మరోవైపు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) 'మోస్ట్ వాంటెడ్' జాబితాలో కూడా ఉన్నాడు. అతని తలపై $25 మిలియన్ల రివార్డ్ ఉంది.

భత్కల్ బ్యాచ్:

ఈ ఐదుగురితోపాటు భారతదేశంలో స్లీపర్ సెల్స్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పే ఇండియన్ ముజాహిదీన్‌ ను స్థాపించిన బాంబర్ ఇక్బాల్ భత్కల్.. ఆ గ్రూపును సహ వ్యవస్థాపకుడు, దానికి ఫైనాన్షియర్‌ గా వ్యవహరిస్తున్న అతని సోదరుడు రియాజ్ భత్కల్ ఇద్దరూ కూడా కరాచీలోనే నివసిస్తున్నారు. భారత్ పై దాడి చేయడానికి వీరంతా పాక్‌ ను లాంచ్ ప్యాడ్‌ గా ఉపయోగిస్తున్నారు.

కాగా.. పహల్గాం ఉగ్రదాడికి బాధ్యత వహించిన 'ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌' (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ.. ఇది పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పాక్.. పహల్గాం దాడికి, లష్కరే తయిబా కు ఎలాంటి సంబంధం లేదని.. సదరు ఉగ్రసంస్థ నెట్‌ వర్క్‌ ను తాము ఇప్పటికే ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

ఈ నేపథ్యంలో... పాకిస్థాన్ రక్షణలో ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితా మరోసారి చర్చకు వచ్చింది. ఇంతమందికి రక్షణ కల్పిస్తున్న పాకిస్థాన్.. టీఆర్ఎఫ్ విషయంలో అమెరికా ప్రకటనపై తీవ్రంగా స్పందించడంలో పెద్ద విచిత్రం లేదని అంటున్నారు. ఇదే సమయంలో ఆ ఏడుగురు మోస్ట్ వాంటెడ్స్ పైనా పాక్ ఓ ప్రకటన చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.