మేము భిక్షమెత్తాం కానీ... పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు!
కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. సాయం కోసం ప్రపంచదేశాలను, పలు అంతర్జాతీయ సంస్థలను అభ్యర్థిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పాక్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని అంటున్నారు.
By: Tupaki Desk | 2 Jun 2025 11:05 AM ISTబలూచిస్తాన్ లోని క్వెట్టాలో సైనిక అధికారుల సమావేశంలో ప్రసంగించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్... చైనా, అజార్ బైజా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ వంటి ఇస్లామాబాద్ మిత్రపక్షాల మధ్య మెరుగైన సంబంధాల గురించి నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ భిక్షాటన పాత్ర వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్.. సాయం కోసం ప్రపంచదేశాలను, పలు అంతర్జాతీయ సంస్థలను అభ్యర్థిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పాక్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని అంటున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన పాక్ ప్రధాని.. ఇకపై భిక్షాపాత్రతో పాక్ తమ వద్దకు వస్తుందని మిత్రదేశాలు ఆశించడం లేదని అన్నారు.
ఈ సందర్భంగా... పాకిస్థాన్ కు చైనా దీర్ఘకాల మిత్రదేశం అని చెప్పిన ప్రధాని షరీఫ్... టర్కీ, యూఏఈ, అజర్ బైజాన్ ల మాదిరిగానే సౌదీ అరేబియా కూడా అత్యంత నమ్మకమైన దేశమని అన్నారు. ప్రస్తుతం వాణిజ్యం, పరిశోధనాభివృద్ధి, విద్య, ఆరోగ్యంలో పరస్పరం భాగస్వామ్యం కావాలని వారు ఆశిస్తున్నారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే... అన్ని విషయాల్లోనూ పరస్పరం నిమగ్నం కావాలని కోరుకుంటున్న మిత్రదేశాలు.. వారిని ఆర్థికసాయం అభ్యర్థిస్తూ రావాలని వారు ఇక కోరుకోవడం లేదని పేర్కొన్నారు. దీంతో... అంటే ఇప్పటివరకూ ఆ పని చేసినట్లు పాక్ ఒప్పుకున్నట్లే కదా అనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి!
ఇదే సమయంలో.. ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ తో పాటు ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని చెప్పిన పాక్ ప్రధాని షరీఫ్... దేశంలో సహజ వనరులతోపాటు మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని.. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వార ఆర్థిక సవాళ్లను అధిగమించొచ్చని అన్నారు.
కాగా... తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదురుకొంటున్న పాక్ కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఒక బిలియన్ డాలర్ల నిధులు మంజూరు చేసింది. ఈ సమయంలో అనేక షరతులు విధించిన ఐఎంఎఫ్... భారత్ తో ఉద్రిక్తతలు పెంచుకుంటే సమస్యలు తప్పవని చురకలు అంటించింది.
