అమెరికాతో చర్చలు.. పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన ఇరాన్!
ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద దెబ్బ తగిలింది.
By: A.N.Kumar | 4 April 2026 11:44 PM ISTఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద దెబ్బ తగిలింది. ఇస్లామాబాద్‌లో ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపే ప్రయత్నం విఫలమైందని అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ముఖ్యంగా ఈ సమావేశానికి తాము హాజరుకావడం లేదని ఇరాన్ స్పష్టంగా తెలియజేయడం ఈ పరిణామంలో కీలకంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేయాలని ప్రయత్నించింది. ఇరాన్, అమెరికా ప్రతినిధులను ఒకే వేదికపైకి తీసుకురావాలని భావించి ఇస్లామాబాద్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల మద్దతు కూడా పాకిస్థాన్‌కు లభించినట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నాలు చివరికి ఫలించలేదు.
ఇరాన్ అధికార వర్గాలు స్పష్టంగా తెలిపిన దాని ప్రకారం.. అమెరికా ఉంచిన షరతులు తమకు అస్సలు ఆమోదయోగ్యం కావని వెల్లడించాయి. ముఖ్యంగా తమ అణు కార్యక్రమంపై పరిమితులు విధించాలన్న అమెరికా డిమాండ్లను ఇరాన్ ఖండించింది. అంతేకాకుండా ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయకుండా చర్చలకు రావడం అసంభవమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సమావేశానికి హాజరుకావడం లేదని తేల్చి చెప్పింది.
దీంతో పాకిస్థాన్‌కు పెద్ద రాజకీయ దెబ్బ తగిలినట్టయింది. అంతర్జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ పాత్రను పోషించాలని భావించిన పాకిస్థాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పాకిస్థాన్‌కు.. ఈ పరిణామం మరింత ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇరాన్ – అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాలు కూడా శాంతి చర్చలకు ప్రోత్సాహం ఇచ్చినా ఇరాన్ కఠిన వైఖరి కారణంగా ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయి. ప్రాంతీయ స్థిరత్వంపై ఈ పరిణామం ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం మధ్యప్రాచ్యంలో శాంతి ప్రయత్నాలకు గట్టి షాక్‌గా మారింది. పాకిస్థాన్ సహా పలు దేశాలు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో, ఇక ముందు పరిస్థితి ఎలా మారుతుందన్నది అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇరాన్ తన వైఖరిని మార్చకపోతే, ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది.
