పాక్ ఎయిర్ లైన్స్ ని కొన్న హబీబ్ ఎవరు.. భారత్ తో సంబంధం ఏమిటి..!
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతూ.. దానాలు, రుణాలతో బండి లాగిస్తున్న పాకిస్థాన్.. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)ని అమ్మేసింది.
By: Tupaki Desk | 24 Dec 2025 5:00 PM ISTఆర్థిక ఇబ్బందుల్లో కొట్టు మిట్టాడుతూ.. దానాలు, రుణాలతో బండి లాగిస్తున్న పాకిస్థాన్.. తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ)ని అమ్మేసింది. ఒకప్పుడు ప్రపంచ ఆధిపత్యాన్ని కలిగి ఉన్న ఈ పాకిస్థానీ విమానయాన సంస్థ.. ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలో లోపం కారణంగా "ఫర్ సేల్" బోర్డు తగిలించుకోవాల్సి వచ్చింది. తాజాగా అమ్ముడైపోయింది.
అవును... పాకిస్థాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థ పీఐఏ అమ్ముడైంది. ఈ సందర్భంగా.. వ్యాపార దిగ్గజం ఆరిఫ్ హబీబ్ గ్రూపు పీఐఏ లో మెజారిటీ వాటాను 135 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసింది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఎయిర్ లైన్స్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితికి వచ్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరీ ఆరిఫ్ హబీబ్ అనే చర్చ తెరపైకి వచ్చింది.
చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ పలు ప్రభుత్వ సంస్థలను అమ్మాలని నిర్ణయించుకుందని అంటున్నారు. ఈ సమయంలో అత్యంత కీలకమైన ప్రభుత్వ విమానయాన సంస్థలను విక్రయించే స్థాయికి వెళ్లిపోయింది. ఈ సమయంలో ఇస్లామాబాద్ లో జరిగిన బిడ్డింగ్ లో పాకిస్థాన్ వ్యాపారవేత్త ఆరిఫ్ హబీబ్ 135 బిలియన్ రూపాయలకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ను దక్కించుకున్నారు.
ఈ క్రమంలో.. పాకిస్థాన్ ఇంటర్నెషనల్ ఎయిర్ లైన్స్ లో 75% వాటాను కొనుగోలు చేశారు. మిగిలిన 25% వాటాను కొనుగోలు చేయడానికి 90 రోజుల వరకూ సమయం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి హబీబ్ అనే విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. పైగా భారతదేశంతో ఆయనకు లోతైన సంబంధాలు ఉన్నాయనే విషయమూ తెరపైకి వచ్చింది.
ఎవరీ ఆరిఫ్ హబీబ్..?:
పాకిస్థాన్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఆరిఫ్ హబీబ్ ఒకరు. ఈయన దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఆరిఫ్ హబీబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన హబీబ్... తన గ్రూపు వ్యాపారాన్ని అనేక రంగాలకు విస్తరించారు. ఇందులో ఫైనాన్షియల్ సర్వీసెస్, రసాయనాలు, సిమెంట్, ఉక్కు, రియల్ ఎస్టేట్, ఇంధన రంగాలలో ఆయన వ్యాపారం విస్తరించి ఉంది.
ఇదే సమయంలో... ఫాతిమా ఫెర్టిలైజర్స్, ఆయేషా స్టీల్స్, జావెద్ కార్పొరేషన్ తో తన గ్రూపులోని ప్రధాన వ్యాపారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఆయన నాయకత్వంలోని ఈ గ్రూపు.. పాక్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుళ రంగ వ్యాపార సమూహాలలో ఒకటిగా మారింది. ఈ రోజు విమానయాన సంస్థను కొనుగోలు చేసింది!
ఇక.. 1953లో జన్మించిన ఆరిఫ్ హబీబ్.. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత 1970లో బ్రోకరేజ్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. ఆ రోజు నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదని అంటున్నారు.
ఇక భారత్ తో హబీబ్ కి ఉన్న లోతైన సంబంధాల విషయానికొస్తే... టీ వ్యాపారంలో పాలుపంచుకున్న ఆరిఫ్ హబీబ్ తల్లితండ్రులు.. 1948లో భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోగల బంట్వా నుంచి కొత్తగా ఏర్పడిన పాకిస్థాన్ కు వలస వెళ్లారు. ఈ క్రమంలో హబీబ్ కరాచీలో జన్మించారు. ఈ ఫ్యామిలీ తొలుత చాలా ఆర్థిక కష్టాలు అనుభవించిందని నివేదికలు చెబుతున్నాయి.
