అమెరికాను తాకగలిగే మిస్సైల్స్ తయారీలో పాక్... ట్రంప్ ఎక్కడ?
అవును... ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పాకిస్థాన్ రహస్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 25 Jun 2025 10:33 AMపాకిస్థాన్ తో శత్రుత్వం ప్రమాదం.. స్నేహం ప్రాణాంతకం అనేది నానుడి! ఈ విషయం ట్రంప్ కి తెలియంది కాదు. అయినప్పటికీ ఇరాన్ యుద్ధంలో అవసరం పడుతుందేమోనని భావించి ఐ లవ్ యూ అని అనేశారు! కట్ చేస్తే... అమెరికాలోని పలు లక్ష్యాలను తాకగలిగే సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ఆ దేశం రహస్యంగా అభివృద్ధి చేస్తోందని తెలుస్తోంది.
అవును... ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పాకిస్థాన్ రహస్యంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాషింగ్టన్ లోని నిఘా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించాయి. వీటికి 5,500 కి.మీ. కంటే ఎక్కువదూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉంటుందని అంటున్నారు. దీంతో.. ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ నిఘా సంస్థలు రూపొందించిన నివేదికల ప్రకారం... పాకిస్థాన్ లోని ఉగ్రసంస్థలే లక్ష్యంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా సహాయంతో తమ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలని ఇస్లామాబాద్ భావించింది. అందుకు అనుగుణంగానే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రహస్యంగా అభివృద్ధి చేస్తోంది.
ఇవి అమెరికాలోని పలు లక్ష్యాలను తాకగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. అయితే... అలాంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పాకిస్థాన్ అభివృద్ధి చేయాలని గానీ, కొనుగోలు చేయాలని గానీ ప్రయత్నిస్తే.. ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తామని అమెరికాకు చెందిన అధికారులు పేర్కొన్నట్లు ఆ నివేదికలో వెల్లడించింది.
ఇదే సమయంలో... అమెరికాకు ముప్పును కలిగించేలా లేదా అణ్వాయుధాలు కలిగిఉన్న ఏ దేశాన్ని అయినా అగ్రరాజ్యం తన ప్రత్యర్థిగా ప్రకటిస్తుందని ఆ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రష్యా, చైనా, ఉత్తర కొరియాలను అమెరికా శత్రువులుగా పరిగణిస్తోందని వెల్లడించింది. దీంతో.. పాకిస్థాన్ వ్యవహారానికి సంబంధించిన విషయం సంచలనంగా మారింది.
కాగా... కొంతకాలంగా పాకిస్థాన్ స్వల్ప, మధ్యస్థ శ్రేణి క్షిపణులను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించిందని చెబుతున్నారు. అయితే.. ఇప్పటివరకూ ఆ దేశం దగ్గర ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు లేవు. ఈ క్రమంలో... గతేడాది పాకిస్థాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి అమెరికా పలు ఆంక్షలు పెట్టింది.
ఇదే సమయంలో... ఈ క్షిపణి కార్యక్రమాన్ని పర్యవేక్షించే ప్రభుత్వ యాజమాన్యంలోని రక్షణ సంస్థ నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్, మరో మూడు సంస్థలతోను అమెరికన్ సంస్థలు వ్యాపారం చేయకుండా నిషేధించింది. అటువంటి మిస్సైల్స్ ను పాక్ తయారుచేయడం తమకు ముప్పేనని తెలిపింది. అయితే, ఈ నిషేధంపై అప్పట్లో పాకిస్థాన్ పలు విమర్శలు చేసింది.
ఈ నేపథ్యంలో తాజాగా రహస్యంగా నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీని పాకిస్థాన్ మొదలుపెట్టిందని వాషింగ్టన్ లోని నిఘా సంస్థలు పేర్కొనడంతో.. దీనిపై వైట్ హౌస్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.