Begin typing your search above and press return to search.

పాక్ ప్రధాని దవడ పగలగొట్టామన్న కబుర్లు... మీడియాలో నవ్వులపాలు!

తాజాగా ప్రసంగించిన పాక్ ప్రధాని.. పాక్ సార్వభౌమాధికారంపై భారత్ ప్రత్యక్ష దాడికి పాల్పడుతోందని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   8 May 2025 9:21 AM IST
పాక్  ప్రధాని దవడ పగలగొట్టామన్న కబుర్లు... మీడియాలో  నవ్వులపాలు!
X

పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన అనంతరం పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఈ సందర్భంగా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఇదే సమయంలో.. ఇప్పటికే దవడ పగలగొట్టేల ప్రతిస్పందించామని చెప్పుకొచ్చారు.

అవును... 9 ఉగ్రస్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరున క్షిపణుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 80 మంది వరకూ ఉగ్రవాదులు చనిపోయారని అంటున్నారు. ఈ సమయంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించిన పాక్ ప్రధాని.. తమ ప్రజలను ఏమారుస్తూ, అసత్య ప్రచారాలతో కూడిన ప్రతిస్పందన కబుర్లు చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ప్రసంగించిన పాక్ ప్రధాని.. పాక్ సార్వభౌమాధికారంపై భారత్ ప్రత్యక్ష దాడికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇదే సమయంలో ప్రతీకారం అనివార్యమని ప్రకటించారు. అమాయక అమరవీరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిశ్చయించుకున్నట్లు షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు.

అదంతా ఒకెత్తు అయితే... ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ దాడులు జరిపినప్పుడు పాక్ గట్టిగా ప్రతిస్పందించిందని.. భారత్ దవడ పగలగొట్టే స్థాయిలో రియాక్ట్ అయ్యిందని.. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన 5 యుద్ధ విమానాలను పాక్ సైన్యం కూల్చేసిందని, శత్రువు విమానాలు ముక్కలయ్యాయని షరీఫ్ చెప్పుకోవడం గమనార్హం.

అయితే.. ఇది పూర్తిగా అసత్య ప్రచారమని అంటున్నారు. ఈ విషయంలో పాక్ లోని సోషల్ మీడియాలో భారత్ యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు పోస్టులు వెళ్లువెత్తగా... వీటిని ఆధారం చేసుకుని చైనా ప్రభుత్వం మీడియా కథనాలు ప్రచురించింది. ఆపరేషన్ సిందూర్ ను పాక్ సైన్యం బలంగా తిప్పుకొట్టినట్లుగా కథనాలు వడ్డించింది!

అయితే.. దీనిని భారత్ దౌత్య కార్యాలయం ఖండించింది. 2021, 2024లో భారత్ లో ప్రమాదాలకు గురైన యుద్ధ విమానాల ఫోటోలను ప్రచురించి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపింది.

అంతర్జాతీయ మీడియాకు అడ్డంగా దొరికేసి...!:

అంతర్జాతీయ మీడియాలో త్న వ్యాఖ్యలపై పదే పదే విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్... ఆపరేషన్ సిందూర్ కు ముందు ప్రగల్భాలు పలికి.. ఆపరేషన్ తర్వాత సన్నాయి నొక్కులు నొక్కి, తాము యుద్ధం కోరుకోవడం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్ యుద్ధ విమానాలను పాక్ కూల్చేసిందనే ప్రచారంపైనా మరోసారి మీడియాకు దొరికేశారు.

ఇందులో భాగంగా... తాజాగా సీ.ఎన్.ఎన్.కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. భారత ఆర్మీకి చెందిన 5 ఫైటర్ జెట్లు కూల్చేసినట్లు పాక్ ప్రకటించుకుంటున్న విషయంపై ప్రశ్నను ఎదుర్కొన్నారు ఖవాజా ఆసిఫ్. దీనిపై ఆయన స్పందిస్తూ... భారత ఆధీనంలోని కశ్మీర్ లో ఫైటర్ జెట్లు కూలినట్లు ఆ దేశ సోషల్ మీడియాలో వస్తుందని బదులిచ్చారు.. నవ్వులపాలయ్యారు!

ఈ సందర్భంగా కల్పించుకున్న యాంకర్... ఈ రోజు మీతో మాట్లాడటానికి కారణం సోషల్ మీడియాలో కంటెంట్ గురించి కాదని.. భారత్ ఫైటర్ జెట్లు కూల్చినట్లు ప్రత్యేకమైన ఆధారాలు, వివరాలు అడుగుతున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... ఈ రాఫెల్ జెట్ లను కూల్చివేసేందుకు ఏదైనా చైనా పరికరాలు ఉపయోగించబడ్డాయా అని ప్రశ్నించారు.

ఈ సమయంలో సమాధానం దాటవేసిన పాక్ మంత్రి... ఫ్రాన్స్ నుంచి భారత్ విమానాలను కొనుగోలు చేసినప్పుడు.. చైనా నుంచి పాక్ కొనుగోలు చేయవచ్చు అని బదులివ్వడం గమనార్హం. అయితే... యాంకర్ ప్రశ్నను రిపీట్ చేయగా... భారత్ విమానాలను డాగ్ ఫైట్ లో కాల్చివేసినట్లు చెప్పుకొచ్చారు.