Begin typing your search above and press return to search.

ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. పాక్ ఇంకా కోలుకోలేదు ఇదే సాక్ష్యం అబ్బా!

అవును... ఆపరేషన్ సిందూర్ సమయంలో మే 10 - 2025న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన దాడిలో పాకిస్థాన్ వైమానిక స్థావరంలోని హాంగర్ ధ్వంసమైంది.

By:  Raja Ch   |   8 Feb 2026 5:03 PM IST
ఆపరేషన్ సిందూర్ దెబ్బ.. పాక్ ఇంకా కోలుకోలేదు ఇదే సాక్ష్యం అబ్బా!
X

ఏప్రిల్ 22 - 2025న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులు ఆహ్లాద వాతావారణంలో ఉండగా.. మారణహోమం సృష్టించిన పాకిస్థాన్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదులు.. 26 మందిని మతం కనుక్కుని మరీ హతమార్చిన సంగతి తెలిసిందే! దీంతో.. మే 7 - 2025న అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని సుమారు 10 కీలక ఉగ్రస్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అనంతరం సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణ నెలకొంది. ఆ సమయంలో భారత్ కొట్టిన దెబ్బ నుంచి పాక్ ఇంకా కోలుకోలేదనే సాక్ష్యాలు తాజాగా తెరపైకి వచ్చాయి.

అవును... ఆపరేషన్ సిందూర్ సమయంలో మే 10 - 2025న భారత వైమానిక దళం (ఐఏఎఫ్) జరిపిన దాడిలో పాకిస్థాన్ వైమానిక స్థావరంలోని హాంగర్ ధ్వంసమైంది. ఈ విషయాన్ని శాటిలైట్ చిత్రాలు అప్పుడు స్పష్టం చేశాయి. అయితే ఆ దాడి జరిగి సుమారు 10 నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఆ హాంగర్ కు జరిగిన నష్టాన్ని పునర్నిర్మించడం లేదా మరమ్మతులు చేయడం జరగలేదనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించిన తాజా శాటిలైట్ చిత్రాలను జాతీయ మీడియా వెల్లడించింది. ఇది వైరల్ గా మారింది.

తాజా నివేదికలో.. ఈ ఏడాది జనవరి 28న తీసిన చిత్రాల్లో హాంగర్ కి సంబంధించి దెబ్బతిన్న రూఫ్ భాగాలు తొలగించినట్లు చూపిస్తున్నాయి. ఇదే క్రమంలో దెబ్బతిన్న పైకప్పును పాక్షికంగా కూల్చివేసినట్లు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో... భారత వైమానిక దళం దెబ్బకు దెబ్బతిన్న ఇతర స్థావరాల వద్ద పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు. దీంతో నాడు భారత్ కొట్టిన దెబ్బ నుంచి పాకిస్థాన్ ఇంకా కోలుకోలేదనే చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై పాక్ నుంచి రియాక్షన్ రావాల్సి ఉంది!

కాగా... మే 10 - 2025న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య భోలారి వద్ద ఉన్న హాంగర్ పై దాడి జరిగింది. ఆ సమయంలో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నించగా.. దానికి ప్రతిస్పందనగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, పాకిస్థాన్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే నేరుగా ఇస్లామాబాద్ ను టచ్ చేసింది.. భోలారీపైనా దాడి చేసింది. ఆ సమయంలో ఐఏఎఫ్ ఎయిర్ టు సర్ఫేస్ మందుగుండు సామాగ్రిని ఉపయోగించినట్లు చెబుతున్నారు!

వీటిలో.. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి సమయంలో సుఖోయ్ లపై బ్రహ్మోస్ ఎయిర్ టు సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించి ఉండొచ్చని అంటుండగా.. ఘర్షణ పెరిగిన తర్వాత రాఫెల్ యుద్ధ విమానాలపై ఫ్రెంచ్ క్షిపణులు.. సుఖోయ్ యుద్ధ విమానాలపై ఇజ్రాయెల్ రాంపేజ్ క్షిపణులు.. మిరాజ్ 2000లపై ఇజ్రాయెల్ క్రిస్టల్ మేజ్ క్షిపణులను ఉపయోగించినట్లు భావిస్తున్నారు!

ఈ దెబ్బ తగిలిన కొన్ని గంటల్లోనే.. అంటే.. మే 10వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) కాషిఫ్ అబ్దులా నుంచి భారత డీజీఎంఓ, లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ కు హాట్ లైన్ లో విజ్ఞప్తి వచ్చింది! దీంతో.. ఆరోజు సాయంత్రం 5 గంటల తర్వాత తక్షణ కాల్పుల విరమణ జరిగింది. దీంతో.. పాకిస్థాన్ ఊపిరి పీల్చుకుంది. కానీ.. నాడు తగిలిన దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదని తాజా చిత్రాలు చెబుతున్నాయి!