పాక్ లో అణుపరీక్షల వార్షికోత్సవ ర్యాలీ.. ప్రపంచానికి కీలక సందేశం!
ఈ సమయంలో పాకిస్థాన్ లో నిర్వహించిన ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరీ ప్రత్యక్షమయ్యాడు.
By: Tupaki Desk | 29 May 2025 4:00 PM ISTభారత్ ఎన్నిసార్లు నెత్తీనోరూ మొత్తుకుని చెప్పినా కొన్ని ప్రపంచ దేశాలు అర్ధం చేసుకుంటుండగా.. ట్రంప్ లాంటి కొంతమంది చెవులుండి వినలేని దేశాధినేతలు మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదు! ప్రస్తుతం భారత్ నుంచి అఖిలపక్ష ఎంపీల బృందం విదేశాల్లో పర్యటిస్తూ ఇదే పనిలో ఉంది. ఈ సమయంలో పాకిస్థాన్ లో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... పాకిస్థాన్ లో ఉగ్రవాదులు అంతర్భాగమనే విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని భారత్ నిత్యం చెబుతోంది. పాకిస్థాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులను వేరు వేరుగా చూడవద్దని మొత్తుకుంటుంది! ఈ సమయంలో పాకిస్థాన్ లో నిర్వహించిన ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరీ ప్రత్యక్షమయ్యాడు.
పాక్ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు. లాహోర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పంజాబ్ అసెంబ్లీ ప్రావిన్షియల్ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాత్ తో కలిసి ఆ ఉగ్రవాది వేదిక పంచుకోవడం గమనార్హం. పైగా ఈ ర్యాలీలో భారత వ్యతిరేక నినాదాలూ చేశారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన సైఫుల్లా కసూరీ... తనను పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ గా నిందించడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యానని వ్యాఖ్యానించాడు. ఆపరేషన్ సిందూర్ దాడిలో మరణించిన ఉగ్రవాది ముదస్సిర్ అహ్మద్ పేరిట పంజాబ్ ప్రావిన్స్ లోని అల్హాబాద్ లో పలు నిర్మాణాలు చేపడతానని చెప్పుకొచ్చాడు.
ఈ విధంగా సుమారు 20 నిమిషాలపాటు సాగిన అతడి ప్రసంగం మొత్తం భారత్ పై విషం చిమ్మడానికే కేటాయించాడు. ఇదే ర్యాలీలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది తల్హా సయీద్ కూడా పాల్గొన్నాడు. అతడు కూడా భారత వ్యతిరేకతను పెంచేలా ప్రసగించాడు.
కాగా... పాకిస్థాన్ లో అధికారికంగా లష్కరే తోయిబా పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే! ఇది కేవలం ప్రపంచాన్ని వంచించడానికి చేసిన ప్రకటన మాత్రమే! ఈ నేపథ్యంలో పీఎంఎంఎల్ ముసుగులో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ అధినేత హఫీజ్ సయీద్ ను ఇప్పటికే ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించింది.
