Begin typing your search above and press return to search.

పాక్ మరో తాలిబాన్ అవుతుందా ?

వారి సలహా సూచనల మేరకే వారి అర్ధింపులు విన్నపాల మేరకే అమెరికా రంగంలోకి దిగి భారత్ తో కూడా చర్చించిందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   14 May 2025 1:00 AM IST
పాక్ మరో తాలిబాన్ అవుతుందా ?
X

పాకిస్థాన్ ఇపుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. ఆ దేశం ఏర్పాటు అయ్యాక కనీ వినీ ఎరగని ఘోర పరాభవం జరిగింది. అంతే కాదు కోలుకోలేని అపారమైన నష్టం కూడా వాటిల్లింది. భారత్ తో పెట్టుకుంటే ఏమవుతుందో కళ్ళకు కట్టినట్లుగా తెలిసి వచ్చింది. భారత్ ని జయించడం అన్నది కాదు కదా జోలికి రావడం అంటేనే వణికిపోయే పరిస్థితి.

అయితే పాక్ లో పాలన కానీ రాజ్య అధికారం కానీ అంతా ఒక్కటిగా ఉండే వ్యవస్థీకృతమైన రూపం లేదు. అక్కడ పేరుకు ప్రజాస్వామ్యం రూపంలో ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఉంది. దానికి ప్రధాని సహా మంత్రివర్గం ఉంది. ఇక మరో వైపు సైన్యం బలంగా ఉంది. ఇంకో వైపు చూస్తే ఉగ్రవాదులు అత్యంత బలంగా ఉన్నారు. ఇలా పాక్ లో అధికార కేంద్రాలు మూడు ముక్కలుగా మారి ఉన్నాయి.

ప్రపంచానికి ఒక అందమైన ముసుగుగా ఉన్న పాక్ కేబినెట్ కి మాత్రం భారత్ విషయంలో గతంలో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నా ఇపుడు అయితే చాలా మార్పు వచ్చింది అని అంటున్నారు. భారత్ జోలికి వెళ్ళి చేతులు కాల్చుకోరాదు అన్నది పాక్ ని ఏలుతున్న వారి అభిప్రాయంగా ఉంది అంటున్నారు. నిజంగా పాక్ కేబినెట్ తో పాటు గతంలో ప్రధానులుగా పనిచేసిన వారు, పాక్ ని ఒక దేశంగా చూడాలని అలాగే మనగలగాలని కోరుతున్న వారు అంతా భారత్ తో పెట్టుకోవద్దు అనే చెబుతున్నారు.

వారి సలహా సూచనల మేరకే వారి అర్ధింపులు విన్నపాల మేరకే అమెరికా రంగంలోకి దిగి భారత్ తో కూడా చర్చించిందని చెబుతున్నారు. అలా కాల్పుల విరమణ అన్నది పాక్ కేబినెట్ అభిమతంగా ఉంది. అయితే తేడా ఇక్కడే వస్తోంది అని అంటున్నారు.

పాక్ సైన్యం మాత్రం కాల్పుల విరమణ విషయంలో అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు. వారు అయితే భారత్ తో ఏదో విధంగా కెలికి వాతలు పెట్టించుకోవడానికే సిద్ధం అంటున్నారు. భారత్ మీద పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎంతలా కసితో రగిలిపోతున్నాడు అన్నది ఆయన ఏప్రిల్ 17న ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అని అంటున్నారు.

అంటే భారత్ విషయంలో ఎందాకైనా అన్నది పాక్ ఆర్మీ ఆలోచనగా కనిపిస్తోంది. తాము సర్వనాశనం అయినా భారత్ మీద యుద్ధం చేయాల్సిందే అన్నది వారి దుర్నీతి అని కూడా అర్ధం అవుతోంది అంటున్నారు ఇలా మండిపోతున్న సైన్యంతో పాక్ కేబినెట్ కి విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఆ దేశ ప్రధానికి ఆర్మీ చీఫ్ కి మధ్య అయితే దూరం పెరిగింది అని అంటున్నారు.

ఇదొక అంశం అయితే మరో వైపు పాక్ ని అన్ని విధాలుగా పరోక్షంగా శాసిస్తూ ఉగ్రవాదాన్ని జీహాదీగా చెప్పుకుంటూ అందులోనే బతికేస్తున్న టెర్రరిస్టులకు మాత్రం ఈ తాజా పరిణామాలు అసలు రుచించడం లేదు అని అంటున్నారు. భారత్ విషయంలో ఉగ్రవాదులది ఆత్మాహుతివాదమే అని అంటున్నారు. తాము చచ్చినా భారత్ శాంతిగా ఉండరాదు అన్నదే ఉగ్రమూకల ఉన్మాదం పంతం అని అంటున్నారు.

ఈ విషయంలో పాక్ సైన్యం మద్దతుతో రెచ్చిపోతూ వచ్చిన ఉగ్ర మూకలు ఇపుడు చేతులు ముడుచుకుని కూర్చోమంటే కూర్చుంటాయా అన్నది ఒక కీలక ప్రశ్న అని అంటున్నారు. అయితే పాక్ సైన్యానికి ఎంతగా ఈ తాజా పరిణామాలు ఇష్టపడకపోయినా పెద్దన్న అమెరికా దీని వెనక ఉండడంతో తగ్గాల్సి వస్తోంది. అయితే ఉగ్రమూకలకు అలాంటివి ఏవీ లేవు అని అంటున్నారు.

దాంతో పాక్ లో వ్యవస్థ అన్నది లేకుండా అరాచకమే అంతా అన్నట్లుగా ఉన్న నేపధ్యంలో భారత్ తో చేసుకున్న కాల్పుల విరమణ అన్నది ఎంతవరకూ అమలు అవుతుంది అన్నదే ఒక పెద్ద ప్రశ్నగా ఉంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక పాక్ లో ప్రజా ప్రభుత్వం మీద సైన్యం గురి పెడుతూనే ఉంటుంది. ఇపుడు కొత్తగా ఉగ్రమూకలు సైన్యం మీద గురి పెట్టే చాన్స్ ఉందని అంటున్నారు.

దీంతో ఆఫ్ఘాన్ లో ప్రజా ప్రభుత్వం రద్దు అయి ఉగ్ర మూకలు అయిన తాలిబన్ల చేతిలోకి దేశం ఎలా వెళ్ళిందో అలా పాక్ లో కూడా జరిగే ప్రమాదం ఉందా అన్నదే ఒక చర్చగా ఉంది. అదే కనుక జరిగితే మాత్రం భారత్ కి మరిన్ని కొత్త చిక్కులు వస్తాయి. అయితే అలా జరిగిన నాడు పాక్ ఒక దేశంగా తన గుర్తింపుని కోల్పోతుందని అపుడు భారత్ స్వేచ్చగా పాక్ మీద దాడులు చేసి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచవచ్చు అని అంటున్నారు.

ఏది ఏమైనా మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్ పేయి చెప్పినట్లుగా మన పొరుగు దేశాన్ని మార్చుకోలేం, కాబట్టి సరైన వ్యూహాలతోనే పాక్ ని దారికి తేవాలి. ఎందుకంటే మనం బాగుండాలి అంటే పొరుగు దేశం కూడా బాగుండాలి. సో పాక్ ని ఈ క్షణం నుంచే ఒక కంట కనిపెట్టాల్సి ఉంది. అక్కడ పేరుకు ప్రజాస్వామ్యం అయినా ఒక ప్రభుత్వం అన్నది నిలిచి ఉండాలి. రానున్న రోజులలో యుద్ధం కంటే వ్యూహాలు ఎత్తుగడలు నిఘా వ్యవస్థల పనితనంతోనే భారత్ పాక్ మీద పై చేయి సాధించగలదని అంతా అంటున్నారు.