పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసుల మిస్సింగ్.. ఏం జరిగింది?
పోలీసుల కోసం పోలీసులే వెతుకుతున్నారు.. పెట్రోలింగ్ కి అని వెళ్లిన ఏడుగురు పోలీసులు మిస్సైపోవడమే ఇందుకు కారణం.
By: Tupaki Desk | 21 July 2025 3:00 AM ISTపోలీసుల కోసం పోలీసులే వెతుకుతున్నారు.. పెట్రోలింగ్ కి అని వెళ్లిన ఏడుగురు పోలీసులు మిస్సైపోవడమే ఇందుకు కారణం. పాకిస్థాన్ లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వాలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా స్పందించిన ఉన్నతాధికారులు ఆఫ్గనిస్థాన్ సరిహద్దులోని సౌత్ వాజిరిస్థాన్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రదేశాల్లో వీరు అదృశ్యమైనట్లు వెల్లడించారు.
అవును... పాకిస్థాన్ లో ఏడుగురు పోలీసులు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... వీరిలో ముగ్గురు లద్దా పోలీస్ స్టేషన్ కు.. మిగతా నలుగురు సర్వాకై పోలీస్ స్టేషన్ కు చెందినవారని అంటున్నారు. వీరిలో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ (డీపీఓ) అర్షద్ ఖాన్వీ ధృవీకరించారు.
ఈ సందర్భంగా... లాధా పోలీస్ స్టేషన్ పరిధిలో సాధారణ పెట్రోలింగ్ విధుల్లో ఉన్నప్పుడు ఇన్సాఫ్, అబిద్, ఇస్మాయిల్ అనే ముగ్గురు పోలీసులు అదృశ్యమయ్యారని... సర్వాకై పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే టాంఘా చాగ్మలై ప్రాంతం నుండి సబ్ ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఖాలిక్ తో పాటు కానిస్టేబుళ్లు ఇర్ఫానుల్లా, హబీబుల్లా, ఇమ్రాన్ లతో కలిపి నలుగురు అధికారులు తప్పిపోయారని తెలిపారు.
ఈ సందర్భంగా వారి ఆచూకీకి సంబంధించి తమకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని.. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని డీపీఓ వెల్లడించారు. ఈ సందర్భంగా... నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) ప్రభుత్వంతో నవంబర్ 2022లో కాల్పుల విరమణను ముగించిన తర్వాత గత ఏడాది కాలంలో ఆదేశంలో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయని అంటున్నారు!
