Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌లో ఇంధన మంట.. లీటరు పెట్రోల్ రూ. 321.. సామాన్యుడి బతుకు ఛిన్నాభిన్నం!

మన దేశంలో పెట్రోల్ ధర వంద దాటితేనే అబ్బా అని భారంగా ఫీలవుతాం.. కానీ, మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి ఊహకందని విధంగా తయారైంది.

By:  Tupaki Political Desk   |   7 March 2026 12:34 PM IST
పాకిస్థాన్‌లో ఇంధన మంట.. లీటరు పెట్రోల్ రూ. 321.. సామాన్యుడి బతుకు ఛిన్నాభిన్నం!
X

మన దేశంలో పెట్రోల్ ధర వంద దాటితేనే అబ్బా అని భారంగా ఫీలవుతాం.. కానీ, మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో పరిస్థితి ఊహకందని విధంగా తయారైంది. అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా నిన్న శుక్రవారం రాత్రి పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీటరుపై ఏకంగా 55 పాకిస్థానీ రూపాయలను పెంచడంతో అక్కడ జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, దాని సెగ పాకిస్థాన్ వంటింట్లో, రోడ్ల మీద స్పష్టంగా కనిపిస్తోంది.

రికార్డు స్థాయికి చేరిన ధరలు

పాక్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడ డీజిల్ ధర లీటరుకు రూ. 335.86 కి చేరింది. ఇక పెట్రోల్ ధర రూ. 321.17 కు పెరిగింది. ఒక దేశంలో ఇంధన ధరలు ఈ స్థాయిలో ఉండడం అంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని వారాలుగా అక్కడ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.., కానీ ఈసారి పెరిగిన 55 రూపాయలు సామాన్యుడి వెన్నుముక విరిచేలా ఉంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా అక్కడ చుక్కలు చూపిస్తున్నాయి.

యుద్ధమే అసలు కారణమా?

అసలు పాకిస్థాన్‌లో ఎందుకింతలా ధరలు పెరుగుతున్నాయి? దీనికి అక్కడి మంత్రులు చెబుతున్న కారణం 'మిడిల్ ఈస్ట్ యుద్ధం'. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరా దెబ్బతింది. దీనివల్ల చమురు ధరలు సుమారు 50 నుంచి 70 శాతం వరకు పెరిగాయని పాక్ మంత్రులు వాపోతున్నారు. పాకిస్థాన్ తన చమురు అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండడం, రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆ దేశం చమురును కొనుగోలు చేయడం భారంగా మారింది.

వారానికోసారి సమీక్ష.. ప్రజల్లో ఆందోళన

ఇంతటి ధరల పెంపుతోనే ఆగకుండా, పాక్ ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ఇకపై ప్రతి వారం ఇంధన ధరలను సమీక్షిస్తామని ప్రకటించింది. అంటే వచ్చే వారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రకటనతో అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాహనాలు ఉన్నవారు వాటిని అమ్ముకోవాలా లేక ఇంట్లోనే ఉంచుకోవాలా అని ఆలోచిస్తున్నారు. సగటు మధ్య తరగతి మనిషి తన ఆదాయంలో సగానికి పైగా కేవలం ప్రయాణాలకే ఖర్చు చేయాల్సి వస్తోంది.

మన దేశంతో పోలిస్తే..

మనం భారత్‌లో పెట్రోల్ ధరల గురించి చర్చించుకుంటాం కానీ, మన దేశంతో పోలిస్తే పాకిస్థాన్ పరిస్థితి దయనీయంగా ఉంది. మన దేశంలో వ్యూహాత్మక నిల్వలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం వల్ల మనం కొంత వరకు ఈ యుద్ధ ప్రభావాన్ని తట్టుకోగలుగుతున్నాం. పైగా ఇరాన్ కూడా హర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ఆంక్షలు తొలగించింది. దీంతో ఇంధనంతో వస్తున్న పుష్పక్ నౌక హర్ముజ్ జల సంధిని దాటి భారత్ వైపునకు వస్తుంది. ఇక భారత్ లో ఇంధన ధరలు పెరగవని అర్థం చేసుకోవచ్చు. కానీ పాకిస్థాన్‌కు ఎలాంటి వెసులుబాటు లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆ దేశానికి ఈ చమురు ధరల మంట కోలుకోలేని దెబ్బ.

యుద్ధం అనేది కేవలం బాంబుల మోతతో ఆగిపోదు, అది దేశాల ఆర్థిక వ్యవస్థలను శ్మశానాలుగా మారుస్తుంది. పాకిస్థాన్‌లో పెరిగిన ఈ ఇంధన ధరలు అక్కడి రాజకీయ సుస్థిరతను దెబ్బతీసేలా ఉన్నాయి. ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, ప్రభుత్వం ఏమీ చేయలేని స్థితిలో ఉంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొంటేనే పాకిస్థాన్ వంటి దేశాలకు కొంతైనా ఊరట లభిస్తుంది. లేదంటే, రాబోయే రోజుల్లో అక్కడ లీటరు పెట్రోల్ 400 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సామాన్యుడి ఆకలి కేకలు, ఇంధన మంటల మధ్య పాకిస్థాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది!