పాకిస్తాన్‌లో 32 అణు బాంబులు మాయం.. అసలు ఏం జరుగుతోంది?
భారత్ , పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ చేసిన ఒక ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
By: Tupaki Desk | 28 April 2025 5:00 AM ISTపాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అబ్బాసీ పాకిస్తాన్ వద్ద 130 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ 130 ఆయుధాలతో భారత్‌పై దాడి చేస్తామని ఆయన బెదిరించారు. ఈ క్రమంలో అబ్బాసీ అణ్వాయుధాల సంఖ్యపై ఒక పెద్ద రహస్యాన్ని కూడా బయటపెట్టారు.
భారత్ , పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ చేసిన ఒక ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. పాకిస్తాన్ వద్ద 130 అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిని భారత్‌పై ప్రయోగించడానికి సిద్ధంగా ఉంచామని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 2023లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్ వద్ద 162 అణ్వాయుధాలు ఉన్నట్లు తేలింది. మరి రెండేళ్లలోనే ఏకంగా 32 అణ్వాయుధాలు ఏమయ్యాయి. ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అబ్బాసీ షరీఫ్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, రైల్వే వంటి కీలకమైన శాఖను నిర్వహిస్తుండడంతో ఆయన మాటలను తేలికగా తీసుకోలేం. ఇప్పటివరకు పాకిస్తాన్ తన అణ్వాయుధాల సంఖ్యపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి మంత్రి స్వయంగా 130 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
గతంలో 'ది బుల్లెటిన్' అనే సంస్థ 2023లో విడుదల చేసిన నివేదిక ప్రకారం పాకిస్తాన్ వద్ద ఉన్న అణ్వాయుధాల వివరాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం పాకిస్తాన్ వద్ద వివిధ రకాలైన 162 అణ్వాయుధాలు ఉన్నాయి. వాటిలో మిరాజ్-జేఎఫ్ రకానికి చెందిన 36, అబ్దాళీ 10, గజనవి 16, షాహీన్-1 16, షాహీన్-2 24, గౌరీ 24, నాసిర్ 24, బాబర్-1 రకానికి చెందిన 12 అణ్వాయుధాలు ఉన్నాయి. అంతేకాకుండా, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను కరాచీ నగరం చుట్టూ కేంద్రీకరించిందని కూడా ఆ నివేదిక వెల్లడించింది. అణ్వాయుధాలు కలిగిన ప్రపంచంలోని మొదటి ముస్లిం దేశం పాకిస్తాన్ కావడం గమనార్హం.
ఇప్పుడు రైల్వే మంత్రి అబ్బాసీ కేవలం 130 అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో గత రెండేళ్లలో 32 అణ్వాయుధాలు ఎక్కడికి పోయాయనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తుంది. పాకిస్తాన్ ఈ ఆయుధాలను వేరే ఏదైనా ముస్లిం దేశానికి విక్రయించిందా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్ టర్కీతో ఆయుధాల విషయంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే ఆయుధాలను విక్రయిస్తే అది అంతర్జాతీయ భద్రతకు పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
