Begin typing your search above and press return to search.

పాక్ మీడియా వింత డిమాండ్.. ట్రంప్ కు ట్రబుల్.. షెహబాజ్ కి నోబెల్!

ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో, ఈ ఒప్పందం ఎప్పుడు నిలిచిపోతుందో ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   9 April 2026 6:45 PM IST
పాక్ మీడియా వింత డిమాండ్.. ట్రంప్ కు ట్రబుల్.. షెహబాజ్ కి నోబెల్!
X

ఇరాన్ పై అమెరికా యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరాన్ మద్దతుదారులైన హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ ఒకవైపు దాడులు కొనసాగిస్తున్నాయి. అయినా యుద్ధాన్ని ఆపేశామని పాకిస్తాన్ మీడియా ప్రచారం చేసుకుంటోంది. ఇక పాక్ ప్రధాని షెహబాజ్ ను కీర్తించే ఓ సెక్షన్ మీడియా అయితే ఓ అడుగు ముందుకేసి శాంతి కపోతం ఎగరేసిన తమ ప్రధానికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది. కేవలం అమెరికా ప్రయోజనాల కోసం ఇరాన్ పై దాడిని పదిహేను రోజులు ఆపినందుకే పాక్ మీడియా ఇంత హడావుడి చేయడంపై అంతర్జాతీయం విస్తృత చర్చ జరుగుతోంది. ఈ మాత్రం దానికి పాక్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలంటే అమెరికా అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్ ఊరుకుంటారా? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణను చూసి పాక్ మీడియా పడుతున్న పాట్లు చూస్తుంటే నవ్వు ఆపుకోవడం ఎవరి తరమూ కావడం లేదని అంటున్నారు. తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అపర చాణక్యుడని, ఆయన మధ్యవర్తిత్వం వల్లే ఇరాన్ యుద్ధం ఆగిపోయిందని, అందుకే ఆయనకు వెంటనే 'నోబెల్ శాంతి బహుమతి' ఇచ్చేయాలని పాక్ మీడియా ఊదరగొట్టడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా రిపోర్ట్స్ ప్రకారం యుద్ధం ఇంకా పూర్తిగా ఆగలేదని వ్యాఖ్యానిస్తున్నారు.

హిజ్బుల్లాపై దాడులు

కేవలం రెండు వారాల చిన్న విరామానికే పాక్ మీడియా హడావుడి చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుండటంతో, ఈ ఒప్పందం ఎప్పుడు నిలిచిపోతుందో ఎవరికీ తెలియడం లేదని అంటున్నారు. ఈ చిన్న విరామానికే షెహబాజ్ షరీఫ్‌ను 'శాంతి దూత'గా అభివర్ణించడం చూస్తుంటే, అప్పు తీర్చలేక ఊరు వదిలి వెళ్తుంటే.. ఆ ఊరి బాగు కోసమే వెళ్తున్నా అన్నట్టుందని పాక్ మీడియాను ఎండగడుతున్నారు.

ట్రంప్ పరిస్థితి ఏంటి?

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ కాల్పుల విరమణను తన 'మాస్టర్ స్ట్రోక్'గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటున్నారు. తనకంటే ముందు ఎవరూ ఇన్ని యుద్ధాలు ఆపలేదని, నోబెల్ ప్రైజ్ తనకే రావాలని ఆయన ఎప్పటి నుంచో పరితపిస్తున్నారు. గతంలో వెనిజులా నాయకురాలు మారియా కొరినా మచాడోకు నోబెల్ ఇస్తే, ఆమె వద్ద నుంచి ఆ మెడల్‌ను గిఫ్ట్‌గా తీసుకున్న చరిత్ర ట్రంప్‌ది. మరి ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ పేరు తెరపైకి తీసుకు వస్తే ట్రంప్ ఊరుకుంటారా? అనేదే ఆసక్తికర చర్చగా మారింది. "బహుమతి నాది.. మధ్యవర్తిత్వం నాది.. మధ్యలో ఈ షెహబాజ్ ఎవరు?" అంటూ ట్రంప్ విరుచుకుపడినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

పాక్ మీడియా 'గొంతెమ్మ కోర్కెలు'..

సొంత దేశంలో ఆర్థిక వ్యవస్థ అట్టడుగున ఉన్నా, గోధుమ పిండి కోసం ప్రజలు కొట్టుకుంటున్నా.. పాక్ మీడియాకు మాత్రం అంతర్జాతీయ శాంతి గురించి ఆందోళన ఎక్కువ. భారత్-పాక్ సరిహద్దులో ఉగ్రవాదాన్ని ఆపలేని వారు, ఇరాన్ యుద్ధాన్ని ఆపేశామని చెప్పుకోవడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గతంలో అబ్దుల్ సత్తార్ ఈదీ లాంటి నిజమైన సేవకులకు దక్కని నోబెల్, ఇప్పుడు కేవలం ఒక టెంపరరీ సీజ్ ఫైర్ కోసం షెహబాజ్ కి ఇవ్వాలని కోరడం చూస్తుంటే "వినేవాడు పాకిస్థానీ అయితే.. చెప్పేవాడు షెహబాజ్ షరీఫ్" అన్నట్టుంది అంటే చమత్కరిస్తున్నారు.

ఈ పరిణామాలు చూస్తుంటే అసలు గొడవ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాల మధ్య అయితే.. లాభం మాత్రం పాక్ మీడియాకు దక్కుతోందని అంటున్నారు. కనీసం ఈ 'నోబెల్' వార్తలతోనైనా తమ దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని, అప్పుల బాధలను మర్చిపోవాలని వారు భావిస్తున్నట్లున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. శాంతి బహుమతి మాట పక్కన పెడితే.. ఈ రెండు వారాల విరామాన్ని శాశ్వత శాంతిగా మార్చే శక్తి షెహబాజ్ కు ఉందా? అన్నదే అసలైన ప్రశ్న. అప్పటిదాకా పాక్ మీడియా ఈ గొంతెమ్మ కోర్కెలతో ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.