మీరు మారరురా బై... డాలర్ల కోసం పాకిస్థాన్ ‘హిందు’ ప్రేమ?
పాకిస్థాన్‌కు ఇప్పుడు ఒక్కసారిగా “సంస్కృతి ప్రేమ” ముంచుకొచ్చింది. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఏ చరిత్రనైతే అల్మారాల్లో పెట్టి తాళం వేశారో ఇప్పుడు దానికి పట్టిన దుమ్ము దులపడం మొదలుపెట్టారు.
By: A.N.Kumar | 20 May 2026 11:13 AM ISTపాకిస్థాన్‌కు ఇప్పుడు ఒక్కసారిగా “సంస్కృతి ప్రేమ” ముంచుకొచ్చింది. దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా ఏ చరిత్రనైతే అల్మారాల్లో పెట్టి తాళం వేశారో ఇప్పుడు దానికి పట్టిన దుమ్ము దులపడం మొదలుపెట్టారు. లాహోర్ వీధుల్లో ఎన్నడో మర్చిపోయిన పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు ఒక్కొక్కటిగా మళ్లీ బోర్డుల మీద ప్రత్యక్షమవుతుంటే.. స్థానికులతో పాటు సోషల్ మీడియా జనాలకు కూడా కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. నిన్నటి వరకూ “ఇస్లాంపురా”గా పిలవబడిన ప్రాంతం ఇప్పుడు మళ్లీ “కృష్ణ నగర్” అయింది. “బాబ్రీ మస్జిద్ చౌక్” కాస్తా వెనక్కి తిరిగి “జైన్ మందిర్ చౌక్”గా రూపాంతరం చెందింది. “రెహ్మాన్ గలి” బోర్డు తీసేసి “రామ్ గలి” అని తగిలించారు. ఇక “ఫాతిమా జిన్నా రోడ్” కాస్తా వింటేజ్ లుక్‌లోకి వెళ్ళి “క్వీన్స్ రోడ్”గా దర్శనమిస్తోంది. ఇదంతా చూస్తుంటే లాహోర్ ఒక్కసారిగా “మినీ ఇండియా హెరిటేజ్ పార్క్”లా మారిపోతుందేమోననే అనుమానం రాక మానదు!
ఇది చరిత్రపై ప్రేమా? లేక ఐఎంఎఫ్ లోన్ కోసం వేసిన వేషమా?
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎన్నేళ్లుగా “హిందూ గుర్తులు” అంటేనే ఆమడదూరం పరుగెత్తిన దేశానికి ఇప్పుడు ఒక్కసారిగా వాటినే “హెరిటేజ్” అంటూ కౌగిలించుకోవాలనే జ్ఞానోదయం ఎందుకు కలిగిందబ్బా? అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. దీని వెనుక అసలు రహస్యం "చరిత్రపై ప్రేమ" కాదు.. పక్కా "ఆర్థిక గణితం" అని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. చేతిలో పైసల్లేవు.. జేబులో డాలర్లు లేవు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇచ్చే బైలౌట్ ప్యాకేజీ లేకపోతే దేశం దివాళా తీయడం ఖాయం. మరోవైపు ఎఫ్ఏటీఎఫ్ అనే అంతర్జాతీయ సంస్థ ఎప్పుడు ‘టెర్రర్ ఫైనాన్సింగ్’ ముద్ర వేస్తుందోననే వణుకు ఎలాగూ ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు కూర్చుని “చూడండి… మేము ఎంత టాలరెంట్! ఎంత సెక్యులర్! ఎంత కల్చరల్!” అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది. నిన్నటి దాకా పాతేసిన బోర్డులకు, ఈరోజు కొత్త పెయింట్ వేసి మరీ ప్రదర్శనకు పెడుతోంది.
సోషల్ మీడియా సెటైర్
"ఇంట్లో ఐఎంఎఫ్ అధికారులు తనిఖీకి వస్తున్నారని తెలిసి.. దాచిపెట్టిన పాత సంస్కృతి బొమ్మలను బయటకు తీసి, దుమ్ము దులిపి హాల్‌లో సర్దినట్టుంది పాక్ పరిస్థితి!" అని ఒకరు కామెంట్ పెడితే.. "లాహోర్‌లో ఇప్పుడు హిందూ పేర్లు తిరిగి రావడం లేదు బాస్… డాలర్ల కోసం చరిత్రను కొత్త ప్యాకింగ్‌లో అమ్ముతున్నారు" అంటూ ఇంకొకరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
50 బిలియన్ల ‘కల్చరల్ ఫిల్టర్’
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం నవాజ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ “లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్” ప్రాజెక్ట్‌కు ఏకంగా 50 బిలియన్ పాకిస్థాన్ రూపాయలు ఖర్చు చేస్తున్నారట. అధికారికంగా వీరు చెబుతున్న కారణం ఏమిటంటే.. “ప్రీ-పార్టిషన్ విభజనకు ముందు హెరిటేజ్‌ను కాపాడటం”. ఈ మాటలు విన్న విమర్శకులు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. దేశంలో గ్యాస్ లేదు.. కరెంట్ లేదు.. ప్రజలు తినడానికి పిండి లేదు.. ఖజానాలో డాలర్లు లేవు… కానీ బోర్డుల మీద మాత్రం చరిత్ర మెరిసిపోతోంది అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
బోర్డులు మార్చడం సులువు… భావజాలం మార్చడం అంత ఈజీనా?
ఈ మొత్తం ఎపిసోడ్‌లో మిగిలిపోయిన మిలియన్ డాలర్ల ప్రశ్న ఒక్కటే… ఈ పేర్లన్నీ మార్చినంత మాత్రాన అక్కడి మైనారిటీలైన హిందూ, సిక్కు, క్రైస్తవుల నిజ జీవితాలు ఏమైనా మారుతాయా? లేక ఇది కేవలం విదేశీ పెట్టుబడిదారులను, టూరిస్టులను ఆకర్షించడానికి వేసిన ‘కల్చరల్ ఫిల్టర్’ మాత్రమేనా? అన్నది అందరికీ వస్తున్న డౌట్..
మొత్తానికి లాహోర్ వీధుల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకవైపు పాత పేర్లు బోర్డులపైకి వస్తుంటే… మరోవైపు ప్రపంచానికి “మేము మారిపోయాం” అనే గ్రీన్ సిగ్నల్ పంపే ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. అయితే ఇంటర్నెట్ జనాలు మాత్రం ఒకటే ముక్తకంఠంతో చెబుతున్నారు “అయ్యా పాక్ పాలకులారా… వీధుల్లో బోర్డులు మార్చడం చాలా సులువు… కానీ మనసుల్లో దశాబ్దాలుగా నాటుకుపోయిన భావజాలం మార్చడం అంత ఈజీ కాదు!” మరి ఈ 'బోర్డుల మార్పిడి' డాలర్ల వర్షం కురిపిస్తుందో లేదో చూడాలి!
