కరాచీ-క్వెట్టా హైవేపై భారీ పేలుడు.. 32మంది పాక్ సైనికులు మృతి
పాకిస్థాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అయితే ఇప్పుడు అదే ఉగ్రవాదం ఆ దేశానికి కాలనాగై కాటేస్తోంది.
By: Tupaki Desk | 25 May 2025 7:00 PM ISTపాకిస్థాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది. అయితే ఇప్పుడు అదే ఉగ్రవాదం ఆ దేశానికి కాలనాగై కాటేస్తోంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పాకిస్థాన్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుంది. తాజాగా ఖుజ్దార్‌లోని జీరో పాయింట్ సమీపంలో కరాచీ-క్వెట్టా హైవేపై ఒక సైనిక కాన్వాయ్‌ను ఐఈడీ (Improvised Explosive Device)తో లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ భయంకరమైన దాడిలో 32 మంది పాకిస్థానీ సైనికులు మరణించగా డజన్ల కొద్దీ గాయపడ్డారు.
పాకిస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి ఉగ్ర దాడుల వార్తలు రావడం ఇటీవల కామన్ అయిపోయింది. అయితే, ఇప్పుడు ఇలాంటి దాడులు పాకిస్థాన్‌లోని పెద్ద నగరాల్లో కూడా జరుగుతున్నాయి. ఇది దేశ భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ ఘటన పాకిస్థాన్ భద్రతా ఏజెన్సీల బలహీనతలను స్పష్టం చేస్తోంది.
ఖుజ్దార్‌లోని కరాచీ-క్వెట్టా హైవేపై జరిగిన ఈ దాడిలో పేలుడు పదార్థాలు నిలిపి ఉంచిన ఒక కారులో పెట్టారు. సైనిక కాన్వాయ్ అటుగా వెళ్తున్నప్పుడు ఈ కారు పేలింది. నివేదికల ప్రకారం.. ఈ కాన్వాయ్‌లో సైన్యానికి చెందిన 8 వాహనాలు ఉన్నాయి. వాటిలో మూడు వాహనాలు నేరుగా ఈ దాడికి గురయ్యాయి. మృతులలో సైనిక సిబ్బంది కుటుంబాలను తీసుకెళ్తున్న ఒక బస్సు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అధికారులు ఈ భద్రతా వైఫల్యాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. అధికారులు ఈ ఘటనను స్కూల్ బస్సుపై దాడిగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని, తద్వారా అసలు విషయాన్ని మార్చాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇదే కరాచీ-క్వెట్టా హైవేపై మే 21న కూడా ఇలాంటి దాడే జరిగింది. బలూచిస్థాన్‌లోని ఖుజ్దార్ పట్టణం సమీపంలో క్వెట్టా-కరాచీ హైవేపై పిల్లలతో వెళ్తున్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో డ్రైవర్‌తో సహా ఐదుగురు పిల్లలు మరణించారు. వరుసగా జరుగుతున్న ఈ దాడుల వల్ల పాకిస్థాన్ సామాన్య ప్రజల్లో భయం వాతావరణం నెలకొంది.
పాకిస్థాన్ చాలా కాలంగా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు పాకిస్థాన్‌లోనే ఉగ్ర దాడులు పెరుగుతుండటంతో పాక్ భద్రతా ఏజెన్సీల లోపాలు, ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో వారి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
