ఫుల్ కిక్ లో పాక్... స్నేహితులతో సంభాషణలు!
తాజాగా నెలకొన్న పరిస్థితులను వాంగ్ యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది.
By: Tupaki Desk | 11 May 2025 10:01 AM ISTభారత ప్రభుత్వం చెప్పినట్లు... పహల్గాంలో ఉగ్రదాడుల వెనుక ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు ఫుల్ ఖుషీలోనూ, ఆనందాల కిక్ లోనూ ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆ విధంగా పాకిస్థాన్ కు అలా కలిసొచ్చిందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఆనందాన్ని స్నేహితులతో పంచుకుంటున్న తీరును విశ్లేషిస్తున్నారు!
అవును... పాకిస్థాన్ కు శనివారం వరుస గుడ్ న్యూస్ లు వినిపించాయని అంటున్నారు. ఇందులో భాగంగా... తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి, అక్కడ సామాన్య ప్రజానికం బ్రతుకు బండి నడవడం కష్టంగా ఉందనే కామెంట్లు వినిపిస్తోన్న వేళ.. 2.4 బిలియన్ డాలర్ల అప్పును అంతర్జాతీయ ద్రవ్య నిధి మంజూరు చేసింది. తొలుత హుటాహుటిన ఒక బిలియన్ డాలర్ పంపించేసింది!
ఫలితంగా... ఆర్థికంగా పాకిస్థాన్ కాస్త ఊపిరి పీల్చుకుందనే కామెంట్లు వినిపించాయి. ఇక రెండో విషయానికొస్తే... ఇప్పుడు పాకిస్థాన్ ఆర్థికంగా, మందుగుండు సామాగ్రి పరంగా, పక్కన బలూచీస్తాన్ ఇంటర్నల్ వార్ పరంగా ఎన్నో ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ.. మరోపక్క భారత్ లాంటి బలమైన దేశం ముందు తొడకొడుతూ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పరిస్థితి!
అలాంటి పరిస్థితుల్లో... కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించింది! పాకిస్థాన్ డీజీఎంవో భారత్ కు 3:30 కి ఫోన్ చేసి 5 గంటల నుంచి అన్నీ ఆపేద్దాం అని చెప్పగానే.. వెంటనే భారత్ అంగీకరించిందని మిస్రీ చెప్పారు! వాస్తవాలు మాట్లాడుకోవాలంటే... ఇది పాకిస్థాన్ కి మొదటి గుడ్ న్యూస్ కంటే కొన్ని వందల రెట్లు గుడ్ న్యూస్ అనే చెప్పాలి!
ఇదే సమయంలో... ఇరు దేశాల ప్రధానులు, విదేశాంగ శాఖ మంత్రులు, జాతీయ భద్రతా సలహా దారులతో అమెరికా చర్చలు జరిపిందని.. అమెరికా మద్యవర్తిత్వం వల్లే ఇదంతా జరిగిందని ట్రంప్ ప్రకటించారు. దీంతో... అమెరికాకు బాగా కావాల్సిన దేశాల్లో, అమెరికా మిత్ర దేశాలో పాక్ ఒకటనే ప్రచారం ప్రపంచంలోకి బలంగా వెళ్లింది!
ఈ విధంగా పహల్గాం ఉగ్రదాడి అనంతరం కాస్త ధైర్యం చేసి భారత్ పై తెగించి.. అటు అగ్రరాజ్యంతో అంటకాగి.. మరోపక్క చైనా, తుర్కియే వంటి ప్రాణస్నేహితుల సహకారంతో అద్భుతమైన మూడు సక్సెస్ లు కొట్టిందని అంటున్నారు పరిశీలకులు! అట్టుంటాది మా ప్రభుత్వం తోని అని అంటున్నారట పాకిస్థానీయులు!
స్నేహితులతో ముచ్చట్లు!:
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో పాక్ కు అండగా నిలుస్తామని ప్రకటించింది చైనా. తాజా పరిస్థితుల నేపథ్యలో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ.. తో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సంభాషించారు. తాజాగా నెలకొన్న పరిస్థితులను వాంగ్ యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన వాంగ్ యీ... సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో పాకిస్థాన్ సంయమనంతో ఉందని.. బాధ్యతాయుత విధానాన్ని అవలంభించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ కు చైనా అన్నివేళలా వ్యుహాత్మక సహకార భాగస్వామి గా ఉంటుందని.. తమది విడదీయరాని స్నేహమని అన్నారు!
మరోపక్క రక్షణ సహకారం విషయంలో పాకిస్థాన్ కు అన్ని విధాలా అండగా ఉందని చెబుతున్న తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్ తోనూ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ముచ్చటించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించినట్లు చెబుతున్నారు!
