క్రికెట్ వెలి.. తహవ్వూర్ రానా.. ఉగ్రదాడికి ఎన్నో పరోక్ష కారణాలు?
అంతర్జాతీయంగా పాకిస్థాన్ క్రికెట్ లో దాదాపు ఏకాకి.. దాని మాటకు విలువే ఉండదు.. 2009లో ఆ దేశంలో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగాక 10 ఏళ్లకు పైగా ఏ జట్టూ పాకిస్థాన్ లో పర్యటించలేదు.
By: Tupaki Desk | 25 April 2025 12:00 AM ISTఅంతర్జాతీయంగా పాకిస్థాన్ క్రికెట్ లో దాదాపు ఏకాకి.. దాని మాటకు విలువే ఉండదు.. 2009లో ఆ దేశంలో శ్రీలంక క్రికెటర్లపై దాడి జరిగాక 10 ఏళ్లకు పైగా ఏ జట్టూ పాకిస్థాన్ లో పర్యటించలేదు. ఇలాంటి సమయంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ చేపట్టింది. కానీ, భారత్ మాత్రం తమ జట్టు పాకిస్థాన్ లో పర్యటించేందుకు ఒప్పుకోలేదు. దుబాయ్ లో తమ మ్యాచ్ లు ఆడిన టీమ్ ఇండియా అక్కడే కప్ కొట్టేసింది. ఆతిథ్య పాకిస్థాన్ మాత్రం అత్యంత దారుణంగా ఒక్క విజయమూ లేకుండానే లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది.
మరోవైపు భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన ముంబైపై 26/11 ఉగ్రదాడిలో కీలక నిందితుడు తహవ్వూర్ రానాను ఇటీవల అమెరికా 15 ఏళ్ల తర్వాత భారత్ కు అప్పగించింది. రానా పాకిస్థాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు. పాకిస్థాన్ ఆర్మీలో డాక్టర్ గా పనిచేశాడు. 26/11 దాడులకు ముందు రాణా, మరో కీలక నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి ముంబైలో రెక్కీ చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆరోపిస్తోంది. అలాంటి రానాను భారత్ పట్టుకోవడం పాకిస్థాన్ కు తీవ్ర ఇబ్బందికరమే. అతడు దర్యాప్తులో ఏమేం విషయాలు చెబుతాడు..? అందులో పాకిస్థాన్ లింకులు బయటపెడతాడా? అనేది ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది.
కొద్ది రోజుల కిందట భారత పార్లమెంటు వక్ఫ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీనికి చట్ట రూపంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. కశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019లో రద్దు చేసింది. ఆ తర్వాత ఐదేళ్లకు అంటే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిపింది. మరోవైపు కొన్నాళ్లుగా కశ్మీర్ కు పర్యాటకులు పెరుగుతున్నారు. దీంతో ఆ రాష్ట్రంలో మళ్లీ శాంతి నెలకొంటోంది. ప్రజల ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది.
వీటన్నిటి నేపథ్యంలోనూ కడుపులో విద్వేషం, అసలు విషయాల నుంచి డైవర్షన్ చేసే ఉద్దేశంలో పాకిస్థాన్ ఉగ్ర దాడులకు పురికొల్పిందనే వాదన వినిపిస్తోంది.
