ఏపీ, తెలంగాణ ముందు పాక్ ఎంత.. వారి 'లెక్క' ఎంత?
2023-24 మధ్య ఉమ్మడి ఏపీ జీఎస్డీపీతో పోలిస్తే పాక్ జీడీపీ చాలా తక్కువ కావడం గమనార్హం!
By: Tupaki Desk | 23 May 2025 10:08 AM IST1958 నుంచి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) దగ్గర ఇప్పటివరకూ సుమారు 25 సార్లు ఆర్థిక సహాయం పొంది.. తాజాగా ఈ ఏడాది 1.02 బిలియన్ డాలర్లు పొంది.. అప్పులతో నెట్టుకొస్తోన్న పాక్ ఆర్థిక పరిస్థితి గురించి ఓ ఆసక్తికర విషయం చర్చకొచ్చింది. 2023-24 మధ్య ఉమ్మడి ఏపీ జీఎస్డీపీతో పోలిస్తే పాక్ జీడీపీ చాలా తక్కువ కావడం గమనార్హం!
అవును... 2014-15 రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లు కాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ రాష్ట్ర జీఎస్డీపీ రూ.15.2 లక్షల కోట్లు (సుమారు 180 బిలియన్ డాలర్లు). అంటే.. సుమారు దశాబ్ధంలో దాదాపు 197% వృద్ధిని సాధించింది!
ఇదే క్రమంలో... 2014-15 రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ. 5.05 లక్షల కోట్లు కాగా.. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ రాష్ట్ర జీఎస్డీపీ రూ.15.4 లక్షల కోట్లు (సుమారు 180 బిలియన్ డాలర్లు). అంటే.. సుమారు దశాబ్ధంలో దాదాపు 197% కంటే వృద్ధిని సాధించింది!
ఆ సంగతి అలా ఉంటే... ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం 2023 సంవత్సరానికి పాకిస్థాన్ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 338.37 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ఇదే జీడీపీ 2022 లో సుమారు 368.82 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే.. 2022తో పోలిస్తే 2023లో 9.7% తగ్గిందన్నమాట!
అంటే... పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సుమారు 338 బిలియన్ డాలర్లుగా ఉండగా.. రెండు తెలుగు రాష్ట్రాల (ఉమ్మడి ఏపీ) జీఎస్డీపీ 360 బిలియన్ డాలర్లుగా ఉందన్నమాట. అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల జీఎస్డీపీ కంటే పాకిస్థాన్ దేశం మొత్తం జీడీపీ తక్కువగా ఉంది. కాకపోతే పాక్ జనాభా మాత్రం సుమారు 24.7 కోట్లు కావడం గమనార్హం.
ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాభా మొత్తం సుమారు 9.3 (దాదాపు ఏపీ 5.3 కోట్లు, తెలంగాణ 4 కోట్లు) అనుకుంటే.. ఇక్కడ తలసరి ఆదాయం 3,000 డాలర్లుగా ఉండగా.. పాకిస్థాన్ లో 1,616 డాలర్లుగా మాత్రమే ఉంది.
ఇదే సమయంలో... భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం ఉన్న మహారాష్ట్ర విషయానికొస్తే పాకిస్థాన్ చాలా వెనుకబడి ఉండటం గమనార్హం. ఇందులో భాగంగా... ప్రస్తుతం పాకిస్థాన్ జీడీపీ 338 బిలియన్ డాలర్లుగా ఉండగా.. మహారాష్ట్ర జీఎస్డీపీ 490 బిలియన్లుగా ఉంది. అంటే.. పాక్ జీడీపీ మహారాష్ట్ర జీఎస్డీపీలో 69% మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది.
