సిగ్గు లేని పనికి సెటైర్లు... పాక్ ఫేక్ ప్రయత్నాలు!
ఇప్పుడు పాకిస్థాన్ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం అత్యంత అవసరం.
By: Tupaki Desk | 9 May 2025 1:12 PM ISTఫేక్ ప్రచారాలు చేయడంలో పాకిస్థాన్ ది అందెవేసిన చేయి అనేది చాలా మంది మాట. పాక్ కూడా చాలాసార్లు నిరూపించుకుంది. గతం సంగతి కాసేపు పక్కనపెడితే.. ఆపరేషన్ సిందూర్ లో ఉగ్ర శిబిరాలను భారత్ కుల్లబొడిచేస్తే... తాము కూడా భారత్ కు చెందిన ఐదు యుద్ధ విమానాలను కూల్చేసినట్లు పాత ఫోటోలతో ఫేక్ ప్రచారం చేసుకుంది పాక్.
భారత్ లో కొన్ని ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు కూలిపోయిన జెట్ల ఫోటోలకు రంగులు అద్ది సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. ఆ ప్రచారాన్ని చైనా అధికారిక మీడియాలో కథనాలుగా రాయించుకుని ఫేక్ ప్రచారానికి మరింత కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో.. సిగ్గు లేని పనిని కప్పి పుచ్చుకోవడానికి ఫేక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అవును... ఇప్పుడు పాకిస్థాన్ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ దేశానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) నుంచి ఆర్థిక సహాయం అత్యంత అవసరం. పైగా అత్యంత కీలకమైన ఐ.ఎం.ఎఫ్. సమావేశం ఈ రోజు జరుగుతుంది. మరోపక్క ఈ సహాయాన్ని అడ్డుకోవాలని భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని అంటున్నారు.
ఈ సమయంలో.. పాకిస్థాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎక్స్ అకౌంట్ నుంచి ఓ పోస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా... శత్రువు దాడులతో భారీ నష్టాలు చవిచూశామని.. ఈ సమయంలో మాకు మరిన్ని అప్పులు కావాలని అంతర్జాతీయ భాగస్వాములను కోరుతున్నట్లు ఆ దేశ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.
ఇదే సమయంలో... ఓ పక్క యుద్ధ పరిస్థితులు, ఫలితంగా కుప్పకూలుతున్న స్టాక్ పడిపోవడంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని.. ఇలాంటి పరిస్థితుల నుంచి తాము గట్టెక్కేందుకు సాయం చేయమని కోరింది. దీంతో.. ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీనిపై నెట్టింట సెటైర్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్ ఓ (ఫేక్) ప్రచారం తెరపైకి తెచ్చింది!
ఇందులో భాగంగా... తమ ఆర్థిక శాఖ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, అందులో అప్పులు అడుగుతూ పెట్టిన పోస్ట్ ఫేక్ అంటూ పాక్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికార ఫ్యాక్ట్ చెక్ లో వెల్లడించింది. ఆర్థిక సహాయం చేయాలని తమ శాఖ ఎలాంటి విజ్ఞప్తి చేయలేదని చెప్పుకొచ్చింది. దీంతో.. కౌంటర్లు, సెటైర్లు మరింత ఎక్కువయ్యాయని తెలుస్తోంది!
మరోపక్క.. తమ దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్న స్థితిలో ఉన్నప్పటికీ.. నేతలు మేకపోతు గాంభీర్యం నటిస్తూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని భావించి.. పాక్ పౌరులే ఎవరో ఆ ఎక్స్ అకౌంట్ ను హ్యాక్ చేసి.. వారే ఇలా తమ నేతల తరుపున అడగడం మొదలుపెట్టారేమో అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే... పాక్ ఫేక్ బ్యాక్ గ్రౌండ్ ఈ అభిప్రాయాలను కొట్టి పారేసుందనే మాటలూ వినిపిస్తుండటం గమనార్హం.
