బ్రేకింగ్: నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యంపై పాక్ ఆర్మీ కాల్పులు
ఒకటి తర్వాత ఒకటిగా చేస్తున్న పాకిస్థాన్ తప్పుల జాబితాలో మరో భారీ తప్పు చేరింది.
By: Tupaki Desk | 25 April 2025 10:41 AM ISTఒకటి తర్వాత ఒకటిగా చేస్తున్న పాకిస్థాన్ తప్పుల జాబితాలో మరో భారీ తప్పు చేరింది. పహల్గాం ఉగ్రదాడి వేళ.. తమ తప్పు నిజంగా లేదన్న విషయాన్ని దాయాది దేశం స్పష్టం చేయాలనుకుంటే అందుకు తగ్గట్లుగా స్పందన ఉంటుంది. అందుకు భిన్నంగా మతం పేరుతో భారత్ లో చోటు చేసుకున్న ఊచకోతలో పాక్ హస్తం ఉందన్నట్లుగా ఆ దేశ తీరు కనిపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న వేళ.. సరిహద్దుల్లో సంయమనం పాటించాల్సిన పాక్ ఆర్మీ.. అందుకు భిన్నంగా వ్యవహరించింది.
నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి ఈ తెల్లవారుజాము నుంచి కాల్పుల తీవ్రత మరింత పెరిగింది. శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు ధీటుగా బదులు ఇస్తోంది. గురువారం అర్థరాత్రి నుంచి కాల్పులు మొదలైనట్లుగా చెబుతున్నారు. పాక్ ఆర్మీ కాల్పుల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని.. ఎవరికీ గాయాలుకాలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.
పహల్గాం ఉగ్రదాడి వేళ.. వేదనతో ఉన్న భారత్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పాకిస్థాన్ అందుకు భిన్నంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం చూస్తే.. ఆ దేశానికి తగిన శాస్తి చేయాల్సిన అవసరం ఉందన్న విషయం అర్థమవుతుంది. ప్రధాని మోడీ గురువారం చెప్పినట్లుగా ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామన్న మాటలకు అదనంగా.. పాకిస్థాన్ కు సైతం ఆ తరహా శిక్ష విధించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. అదే పనిగా కవ్వింపులకు పాల్పడుతున్న దాయాది ఇప్పట్లో కోలుకోలేని రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.
