Begin typing your search above and press return to search.

తినేందుకు తిండి లేదు కానీ యుద్ధం కావాలట!

కానీ.. దాయాది పాకిస్తాన్ తీరు చూస్తే.. ఫ్యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని మూర్ఖత్వం వారిలో కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   27 April 2025 10:01 AM IST
తినేందుకు తిండి లేదు కానీ యుద్ధం కావాలట!
X

తెలుగువారికి సుపరిచితమైన ఫ్యాక్షన్ సినిమాల్లో విలన్ పాత్రధారిని చూస్తే.. వీడేం మనిషి అన్నట్లుగా ఉంటాడు. తన పంతం కోసం అర్థం లేని పట్టుదలకు పోవటం.. అంతకు మించిన మూర్ఖత్వాన్ని ప్రదర్శించటం.. సొంతోళ్లను సైతం చంపుకోవటానికి వెనుకాడని తీరు కనిపిస్తుంది. ఈ లక్షణాలు సినిమాల్లోనే.. నిజ జీవితంలోనూ ఉంటాయా? ఇంతటి కర్కశంగా ఉంటారా? అనిపిస్తుంది. కానీ.. దాయాది పాకిస్తాన్ తీరు చూస్తే.. ఫ్యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని మూర్ఖత్వం వారిలో కనిపిస్తుంది. దేశ ప్రజల బాగు కంటే కూడా.. అర్థం లేని శత్రుత్వాన్ని గుండెల నిండుగా నింపుకొని.. నిత్యం ద్వేషంతోనే బతికే పాక్ పాలకుల పుణ్యమా అని ఆ దేశస్తులు ఆకలితో హాహాకారాలు చేసేలా చేశారు.

కొందరు నేతలు.. సైనిక అధికారుల జీవితాలు మాత్రమే పాకిస్తాన్ లో బాగుంటాయి. ఇక.. సాధారణ ప్రజల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కొన్నేళ్ల క్రితం పాక్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన నియంత జుల్ఫీకర్ అలీ భుట్టో ప్రకటన చూస్తే.. ఆ దేశ పాలకులు ఎంత మూర్ఖులన్న విషయంతో పాటు.. వారికి దేశ ప్రజల కంటే కూడాతమ అర్థం లేని పంతమే ముఖ్యమన్నట్లుగా ఉంటుంది. ‘తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం. అవసరమైతే ఆకలితో మాడుతాం. కానీ.. అణ్వాయుధాల్ని మాత్రం తయారు చేసి తీరుతాం’ అని ప్రకటించారు.

ఆయన కోరుకున్నట్లే.. ఇప్పుడు పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. కానీ.. తినేందుకు తిండి.. తాగేందుకు టీ విషయంలోనూ ఆలోచించాల్సిన దుస్థితి. అంతర్జాతీయ ద్రవ్యనిధి.. చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని బతికి బట్టకడుతుందే తప్పించి.. ఆ దేశం దివాళ ముప్పును ఇప్పటికి పొంచి ఉంది. ఇలాంటి వేళ.. భారత్ లో ఉగ్రదాడుల్ని ప్రోత్సహిస్తూ.. ఉగ్రవాదులకు డెన్ గా మారిన ఈ దేశం ఇప్పుడు యుద్ధ ముప్పును ఎదుర్కొంటోంది. ఓపిక.. సహనంతో ఇంతకాలం వ్యవహరించిన భారత్..ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పాక్ లెక్కలు తేల్చాల్సిన టైం దగ్గర పడింది.

పాలకుల పగ పాకిస్తాన్ కు శాపంగా మారిందని చెప్పాలి. యాభై ఏళ్ల క్రితం దాయాది దేశం దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని ప్రదర్శించింది. 1960-70 మధ్య కాలంలో వృద్ధిరేటు బాగుండేది. బలమైన ఆర్థిక నిర్వాహణ.. భారీగా విదేశీ సాయం.. వ్యవసాయం.. పారిశ్రామిక వృద్ధి మీద ఫోకస్ చేయటంతో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేది. అలాంటి దేశం తరచూ భారత్ మీద పగను పెంచుకొని.. దుష్ట పన్నాగాలు వేస్తూ.. తరచూ దెబ్బలు తింది. దీనికి తోడు సీమాంతర ఉగ్రవాదాన్ని అందిపుచ్చుకొని.. వారికి అండగా నిలుస్తూ భారత్ ను దెబ్బ తీయాలన్న కుయుక్తులు చివరకు ఆ దేశానికే శాపంగా మారాయి.

చివరకు పాకిస్తాన్ పరిస్థితి ఎలా మారిందంటే.. కుంటుతూ గుడ్డుతూ అన్నట్లుగా తయారైంది. పాలకుల తప్పులు.. వారి పగతో దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కొవిడ్ ఆ దేశాన్ని దారుణంగా దెబ్బ తీసింది. దాని నుంచి కోలుకోవటానికి కిందా మీదా పడుతున్న ఆ దేశం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. చివరకు టీ పొడిని దిగుమతి చేసుకోవటానికి కూడా అప్పు చేయాల్సి వస్తోంది. అందుకే టీ వినియోగాన్ని తగ్గించాలని పాక్ ప్రణాళిక శాఖ.. ఆ దేశ ప్రజల్ని అడగటం చూస్తే.. ఆ దేశ దైన్యం అర్థమవుతుంది.

2023లో పాక్ ద్రవ్యోల్బణం రేటు 38.5 శాతానికి చేరింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోవటం.. విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయి. అత్యంత ముఖ్యమైన కొన్ని వస్తువులు.. కొద్దివారాలపాటు దిగుమతి చేసుకోవటానికి మాత్రమే వస్తాయి. ఉగ్రవాదులకు నిధులు ఇస్తున్న కారణంగా ఐదేళ్లు ఆ దేశాన్ని గ్రే లిస్టులో పెట్టటం ద్వారా పాక్ కు రుణాలు దొరకని పరిస్థితి. జీడీపీలో 70 శాతానికి ఆ దేశ అప్పులు చేరాయి. ఆదాయంలో 40 - 50 శాతం వడ్డీల చెల్లింపులకే సరిపోతోంది.

దివాళా ముప్పును తప్పించుకోవటానికి ఐఎంఎప్.. చైనా.. సౌదీ.. యూఏఈల నుంచి రుణాన్ని తీసుకొని గండం నుంచి తప్పించుకుంది. మొత్తం 700 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని అందుకునేందుకు పాక్ అనేక షరతులకు తలొగ్గి.. 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టింది. ప్రస్తుతానికి విదేశీ మారక నిల్వలు పెరిగినా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆ దేశం 22 బిలియన్ డాలర్ల విదేశీ రుణాల్ని తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రకటించిన సింధు జలాల నిలిపివేత.. ఆ దేశ ఆర్థిక వెన్నును దారుణంగా విరుస్తుందని చెప్పక తప్పదు. ఉగ్రభూతాన్ని నిత్యం భారత్ కు పంపే దాయాదికి బలమైన గుణపాఠాన్ని నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.