సిగ్గు లేదా పాకిస్థాన్ అడుక్కోవడానికి..?
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐ.ఎం.ఎఫ్. నిధికి భారత్ అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
By: Tupaki Desk | 9 May 2025 12:58 PM ISTమైకుల ముందు కబుర్లు చెప్పడానికి, కదనరంగంలోకి దిగి నిలదొక్కుకుని పోరాడటానికి ఉన్న తేడా పాక్ కు భారత్ ద్వారా ఎన్ని సార్లు తెలుసుకునే అవకాశం వచ్చినా వారి బుద్ది మారడం లేదు! పాక్ లో మిలటరీ చీఫ్ లు దేశాధినేతలుగా మారాలంటే అందుకు భారత్ పై (ఉగ్ర)దాడులే మార్గాలన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటుంది. ఫలితంగా... దెబ్బ మీద దెబ్బ తిని చతికిలపడుతుంది.
అవును... ప్రశాంతంగా ఉన్న భారత్ లో పాక్ ఉగ్రదాడి చేసింది. కశ్మీర్ టూరిజం అభివృద్ధిని తట్టుకోలేకో ఏమో కానీ.. పహల్గాంలో పర్యాటకులపై పాశవిక దాడికి పాల్పడింది! అది ఉగ్రదాడి కదా అన్నా.. పాక్ దాడి అని చెప్పుకున్నా ఒకటే! కారణం... చనిపోయిన ఉగ్రవాదుల శవపేటికలకు పాక్ జాతీయ జెండాను కప్పి, ఆ దేశ ఆర్మీ అంత్యక్రియలు చేస్తున్న పరిస్థితి.
ఆ సంగతి అలా ఉంటే... ఆపరేషన్ సిందూర్ కు ప్రతీకారంగా అంటూ భారత్ పై దాడులకు తెగబడింది పాక్. దీంతో... ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రశిబిరాలే లక్ష్యంగా దాడులు చేశాం కానీ.. పాక్ సైనిక స్థావరాలను టచ్ చేయలేదని భారత్ చెప్పింది. అయినప్పటికీ పాక్ తుత్తరపనులు మొదలుపెట్టింది. దీంతో... వితౌట్ గ్యాప్ పాక్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది భారత్.
పైగా అప్పటికే పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టిమిట్టాడుతూ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్.) అప్పు ఇస్తే తప్ప బ్రతికి బట్టకట్టలేని స్థాయికి చేరుకున్న పరిస్థితి. ఈ సమయంలో భారత్ పైకి కాలు దువ్వింది. దీంతో... పాక్ గగనతలం మూగబోయింది. ఫలితంగా... ఓవర్ ఫ్లైట్ ఫీజులు రూపంలో వచ్చే వందల మిలియన్ల కీలక ఆదాయం పోయింది!
ఇదే సమయంలో... పాక్ పోర్టులను భారత్ లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నారు. దీంతో... ఆ కోణంలోనూ ఆదాయం శూన్యం! ఇక ఇప్పటికే సిందూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దూ చేయడంతో... 16 లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేసే పాక్ లో 80 శాతం రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. జల విద్యుత్ లోనూ 24% ప్రభావం పడుతుందని అంటున్నారు.
ఇదే సమయంలో పాక్ కు భారత్ నుంచి ఎగుమతి అయ్యే పండ్లు, టమాటాలు, బియ్యం, పశువుల దానా మొదలైనవి ఇప్పటికే ఆగిపోయాయి! ఇలా భారత్ తో అన్ని విధాలా వాణిజ్యం పోవడంతో పాక్ విలవిల్లాడాల్సిన పరిస్థితి. దీనికి తోడు ఈ ఏడాది పాకిస్థాన్ లో సుమారు 10 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్ర ఆహార అభద్రత ఎదుర్కొంటారని ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక ఇచ్చింది.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఐ.ఎం.ఎఫ్. నిధికి భారత్ అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పాక్ కు అప్పు ఇస్తే అది ఉగ్రవాదులను పెంచి పోషించడానికే అనే సత్యాన్ని సాక్ష్యాలతో సహా నేటి ఐ.ఎం.ఎఫ్. భేటీలో నిరూపించే ప్రయత్నం బలంగా చేయనుంది. అదే జరిగితే... పాక్ పరిస్థితి చాలా ఆఫ్రికా దేశాల కంటే దారుణం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఈ నేపథ్యంలో తత్వం బోదపడిదో.. లేక, మరో దిక్కులేక, గత్యంతరం కానరాకో కానీ... పాకిస్థాన్ ఆర్థిక మంత్రి నిస్సుగ్గుగా అడ్డుకోవడం మొదలుపెట్టాడు. వాస్తవానికి చాలా దేశాలు ప్రపంచ బ్యాంకు వద్దో, ఇతర దేశాల దగ్గరో, ఐ.ఎం.ఎఫ్. నుంచో ఆర్థిక సహాయం అప్పు రూపంలో తీసుకుంటాయి. కానీ అవన్నీ చాలా హుందాగా జరుగుతాయి.
అయితే ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆర్థిక శాఖ ట్విట్టర్ వేదికగా అప్పు అడుక్కోవడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా... శత్రువు దాడులతో భారీ నష్టాలు చవిచూశామని.. ఈ సమయంలో మాకు మరిన్ని అప్పులు కావాలని అంతర్జాతీయ భాగస్వాములను కోరుతున్నట్లు పాక్ ఆర్థిక శాఖ ట్వీట్ చేసింది.
ఇదే సమయంలో... ఓ పక్క యుద్ధ పరిస్థితులు, ఫలితంగా కుప్పకూలుతున్న స్టాక్ పడిపోవడంతో ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు తాజాగా ఒప్పుకుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి తాము గట్టెక్కేందుకు సాయం చేయండి మహా ప్రభో అంటూ పాక్ ఆర్థిక శాఖ ఎక్స్ వేదికగా అడుక్కోవడం మొదలుపెట్టింది.
దీంతో.. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇందులో భాగంగా... ‘అడుసు తొక్కనేల, కాళు కడుగనేల’ అని కొంతమంది ఉన్నంతలో కాస్త మర్యాదగా స్పందిస్తుంటే... ‘సిగ్గు లేదా ఇలా అడుక్కోవడానికి?’ అని మరికొంతమంది ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది మాత్రం... ‘యూపీఐ క్యూఆర్ కోడ్ ఇమేజ్ పోస్ట్ చేయండి’ అంటూ వెటకారం ఆడుతున్నారు.
