ఊరంతా ఖాళీ.. ఎటు చూసినా నిర్మానుష్యం.. కరువు కోరల్లో పొరుగు దేశం
దాయాది దేశం పాకిస్తాన్ లో కరువు బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి చారిత్రాత్మక దేరావర్ కోటకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్నే వాలే గ్రామంపై ప్రకృతి విరుచుకుపడింది.
By: Tupaki Desk | 21 April 2025 7:00 PM ISTదాయాది దేశం పాకిస్తాన్ లో కరువు బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి చారిత్రాత్మక దేరావర్ కోటకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోట్నే వాలే గ్రామంపై ప్రకృతి విరుచుకుపడింది. ఒకప్పుడు మనుషుల సందడితో కళకళలాడిన ఈ గ్రామం ఇప్పుడు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. సరిగ్గా నెల రోజు క్రితం వరకు ఇక్కడ ఉన్న దాదాపు 100కుటుంబాలు నివసించేవి. కానీ నేడు ఈ ఊరంతా ఖాళీ అయిపోయింది.
ఈ ఊరు నుంచి ప్రజలంతా బతుకు దెరువు కోసం వెళ్లిపోయారు. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. వంద ఏళ్ల నాటి అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభం మళ్లీ ఇప్పుడు ఏర్పడింది. ఇక్కడ ఎడారి వంటి పరిస్థితులు ఏర్పాడ్డాయి. దక్షిణ పంజాబ్‌లోని చోలిస్తాన్ ఎడారి 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అనేక ప్రాంతాలు సగటు కంటే తక్కువ వర్షపాతం కారణంగా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇక్కడి ప్రాంత ప్రజలు నీటి బొట్టుకోసం ఆరాటపడుతున్నారు.
తరతరాలుగా దాదాపు 1900 సహజ వర్ష ఆధారిత జలాశయాలు.. వీటిలో టోబా, చెరువులు, కుంటలు ఉన్నాయి. సంచార కుటుంబాలకు, వారి పశువులకు ముఖ్యమైన జీవనాధారంగా నిలుస్తూ వచ్చాయి. ప్రతి టోబా చారిత్రాత్మకంగా 80 నుండి 100 కుటుంబాలకు నీటిని అందించేది. కానీ ఈ సంవత్సరం చాలా టోబాలు సాధారణం కంటే ఒకటి లేదా రెండు నెలల ముందే ఎండిపోయాయి. దీని కారణంగా ఇక్కడ నివసించే ప్రజలు ఇక్కడ ఉండడం కష్టమైపోయింది.
ఈ ఏడాది సరిపడా వర్షాలు లేకపోవడం, ప్రభుత్వ నీటి సరఫరా పథకాలు విఫలం కావడం, వాటి నిర్వాహణ సరిగా లేకపోవడం వల్ల కుటుంబాలు పట్టణ కేంద్రాలకు లేదా దేరావర్ కోటకు వలస వెళ్లడం మొదలు పెట్టాయి. అక్కడ ఇప్పటికీ పరిమితంగానే ప్రభుత్వ నీటి సరఫరా కొనసాగుతోంది. కానీ దానిపై కూడా ప్రజలకు నమ్మకం లేదు. మారుతున్న పర్యావరణంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
