పాక్ ఉప ప్రధాని బలుపు మాటలు.. దాయాదికి తగినశాస్తి చేయాల్సిందే
తాజాగా పాకిస్థాన్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని విన్నప్పుడు.. భారతీయుల రక్తం మరిగిపోయేలా ఉందని చెప్పాలి.
By: Tupaki Desk | 25 April 2025 10:56 AM ISTఒక దారుణం జరిగినప్పుడు.. అందులో తమ హస్తం లేదన్న విషయాన్ని స్పష్టం చేయాలని భావించే వేళలో ఏం చేస్తారు? ఎలా వ్యవహరిస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు అందరికి ఇట్టే అర్థమవుతాయి. పహల్గాంలో సాగిన ఉగ్రదాడి ఎంత దారుణమన్న విషయం ప్రపంచం మొత్తానికి అర్థమవుతున్న వేళ.. ఆ విషయంలో తాము ఎలా స్పందించాలన్న విషయంలో పాక్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే.. భారతీయుల రక్తం మరిగేలా చేస్తుందని చెప్పాలి.
పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడితో తమకు సంబంధం లేదంటూ చెబుతోంది పాకిస్థాన్. ఇలాంటి వేళలో.. గాయపడిన భారతీయుల మనసుల్ని ఊరడించేలా వ్యవహరించాల్సిన కనీస బాధ్యత పాకిస్థాన్ మీద ఉంటుంది. అందుకు భిన్నంగా ఆ దేశ పాలకుల తీరు ఉండటం గమనార్హం. తాజాగా పాకిస్థాన్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని విన్నప్పుడు.. భారతీయుల రక్తం మరిగిపోయేలా ఉందని చెప్పాలి.
పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉందన్న అనుమానాలకు బలం చేకూరే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. తాజా పరిణామాలపై ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు స్వాతంత్ర్య సమరయోధులంటూ పిచ్చి ప్రేలాపనులు చేయటం గమనార్హం. ఇస్లామాబాద్ లోని మీడియాతో మాట్లాడిన దార్ ‘ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ లో పహల్గాం జిల్లాలో దాడికి పాల్పడిన వారు స్వాతంత్ర్య సమరయోధులై ఉంటారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు భారతీయుల రక్తం మరిగేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ.. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తాము అంగీకరించమన్న ఆయన.. చర్యకు ప్రతిచర్య తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ తరహా పాలకులకు కచ్ఛితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకు భారత్ సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉండగా.. పహల్గాం కిరాతక చర్య నేపథ్యంలో పాక్ తో చేసుకున్న సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపిసేస్తున్నట్లుగా భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని న్యూఢిల్లీ పాకిస్థాన్ కు అధికారికంగా సమాచారం ఇచ్చేసింది. భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. పాక్ అధికారి సయిద్ అలీ ముర్తుజాకు లేఖ పంపారు. జమ్మూకశ్మీర్ ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోంది. ఈ భద్రతాపరమైన అనిశ్చితులు తమ హక్కులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నట్లుగా పేర్కొంటూ.. గతంలో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణమే నిలిపేస్తున్నట్లుగా లేఖలో స్పష్టం చేశారు.
