పాక్ "చెత్త పని" మాటలు... సమాధానం దాటేసిన అగ్రరాజ్యం!
పహల్గాం దాడి అనంతరం భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 April 2025 3:00 PM ISTపహల్గాం దాడి అనంతరం భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ పై ఇప్పటికే భారత్ దౌత్యపరమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ సందర్భంగా ఈ వ్యవహారంపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా.. ఉగ్రవాద సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ వంటివి పాకిస్థాన్ చాలాకాలంగా చేస్తోంది? దీనిపై మీ స్పందన ఏమిటి అని యాంకర్ ప్రశ్నించారు. దీనిపై జవాబిచ్చిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా... అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్ధాలపాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని చెప్పారు.
ఇదే సమయంలో... ఈ చెత్తపనులు చేయడం పొరపాటయ్యిందనే విషయం తమకు అర్ధమైందని.. ఆ పనులవల్లే పాక్ చాలా ఇబ్బందుల్లో పడిందని.. అసలు, సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే పాకిస్థాన్ ట్రాక్ రికార్డ్ మరో స్థాయిలో ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ సమాధానాలు షాకింగ్ గా మారాయి!
ఇలా సుమారు 30 ఏళ్ల పాటు యూకే, అమెరికా కోసం తాము చెత్త పని చేశామని పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ను విలేకర్లు ప్రశ్నించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆమె ఇష్టపడలేదు.. మరోపక్క కాస్త ఆచి తూచి స్పందిస్తూ అసలు సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.
అవును... అమెరికా కోసం చెత్తపని చేశామని, అదే తమ పాలిట శాపమైందన్నట్లుగా పాక్ చేసిన వ్యాఖ్యలపై యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధిని ప్రశ్నించగా.. అందుకు ఆమె స్పందిస్తూ... తమ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇరుదేశాల (పాక్, భారత్) విదేశాంగ మంత్రులతో మాట్లాడతారని.. ఆ ప్రాంత సరిహద్దుల్లో పరిణామాలను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అన్నారు.
ఇదే సమయంలో వివిధ దశల్లో ఇరుదేశాలతో తాము టచ్ లో ఉన్నామని.. అన్ని వర్గాలతో కలిసి పనిచేసి, ఓ పరిష్కారం సాధించడానికి ప్రోత్సహిస్తామని.. ఇంతకు మించి తన వద్ద ఈ విషయంలో సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ విధంగా ఖవాజా చేసిన వ్యాఖ్యలపై స్పందించమంటే.. సమాధానం దాటవేశారు టామీ బ్రూస్!
