రక్షణ రంగంపై దృష్టిపెట్టిన పాక్... ఏమి చేస్తుందంటే..?
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఓ కీలక నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... రక్షణ రంగానికి బడ్జెట్ ను భారీగా పెంచాలని ఫిక్సయ్యిందని అంటున్నారు.
By: Tupaki Desk | 25 May 2025 12:00 AM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్ లోని ఉగ్రవాదులతో పాటు దాయాదీ సైన్యానికి భారత్ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే! అటు సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం.. అనంతరం పరిణామాలతో పాక్ ను వణికించేసింది. ఆ దేశానికి చెందిన సుమారు 11 ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. అది ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు.
దీనికంతటికీ ప్రధాన కారణం భారత్ వద్ద అత్యంత బలమైన క్షిపణులతో పాటు, అదే స్థాయిలో అత్యంత స్థిరమైన గగనతల రక్షణ వ్యవస్థ కూడా! అయితే.. ఈ రెండింటిలోనూ పాక్ పూర్తిగా తేలిపోయింది. అటు భారత్ పై దాడి చేస్తే.. ఎస్-400 తిప్పికొట్టగా.. బ్రహ్మోస్ వంటి క్షిపణులతో పాక్ గగనతల రక్షణ వ్యవస్థలనే ధ్వంసం చేసింది. ఈ బాధ పాక్ పైకి చెప్పుకోలేనిదిగా మిగిలింది!
పాకిస్థాన్ ఈ స్థాయిలో దెబ్బ తినడానికి మరో కారణం ఆ దేశం కలిగి ఉన్న చైనా మేడ్ ఆయుధాలే అని అంటారు. ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో దాదాపు 80కి పైగా ఆయుధాలు చైనా సరఫరా చేసినవే అని చెబుతారు. అందులో ఫైటర్ జెట్లు, క్షిపణులతో పాటు హెచ్.క్యూ-9 వంటి గగనతల రక్షణ వ్యవస్థలూ ఉన్నాయి. అవన్నీ భారత్ బలం ముందు జుజుబి అయిపోయాయి!
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఓ కీలక నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... రక్షణ రంగానికి బడ్జెట్ ను భారీగా పెంచాలని ఫిక్సయ్యిందని అంటున్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయంలో భారత్ తో పోల్చుకుంటే... నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని, ఇది ఎప్పటికైనా తమ మనుగడ ప్రశ్నార్ధకానికి కారణమే అని భావించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అవును... ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసే విషయంలో చురుగ్గా ముందుకు కదులుతుందని అంటున్నారు. ఇందులో భాగంగా... అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ (డబ్ల్యూబీ) నుంచి తీసుకొచ్చిన రుణాలను రక్షణ రంగానికి వినియోగించాలని భావిస్తొందని అంటున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ను 18% పెంచాలని భావిస్తోన్నట్లు కథనాలొస్తున్నాయి!
వాస్తవానికి 2024 ఆర్థిక సంవత్సరానికి భారత రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్ 86.1 బిలియన్ డాలర్లు కాగా.. అదే ఏడాదికి పాక్, తన రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం 10.2 బిలియన్ డాలర్లు మాత్రమే! దీంతో.. భారత్ తో ఇప్పట్లో పోటీ పడలేకపోయినా.. కనీసం ఎంతో కొంత రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని భావించిన పాక్.. తెచ్చుకుంటున్న అప్పులో కీలక వాటా డిఫెన్స్ కు కేటాయించనుందని తెలుస్తోంది.
