చెయ్యాల్సిందంతా చేసి ‘దేవుడిపై భారం’.. పాక్ మంత్రి వ్యాఖ్యలు!
అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2025 10:21 AM ISTచేయాల్సిందంతా చేసి, అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసి, అసలు మనిషి ప్రాణమంటేనే ఏమాత్రం విలువ లేకుండా ప్రవర్తించి, నిత్యం భారత్ నాశనం కోరుతూ అందుకోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. తాజాగా దేవుడిపై భారం వేసింది. ఈ సందర్భంగా... యుద్ధం జరగకుండా దేవుడే ఆపాలంటూ పాక్ మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
అవును... పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే... రోజులు గడుస్తున్న కొద్దీ అవి మరింతగా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్. భారత్ – పాక్ ల మధ్య శాంతిని నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇరుదేశాలు తగ్గడం లేదని అన్నారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఖవాజా ఆసిఫ్... పహల్గాం దాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రోజురోజుకీ ఉద్రిక్తత పెరుగుతోందని.. శాంతి నెలకొల్పాలని వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నాయని.. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు రోజు రోజుకీ తీవ్రతరంగా మారుతున్నాయని అన్నారు. ఒకవేళ భారత్ దాడులు నిర్వహిస్తే.. తాము ప్రతిదాడులు చేస్తామని చెప్పుకొచ్చారు.
నిత్యం నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మీరుతుండగా... ఆసిఫ్ మాత్రం భారత్ క్షేత్రస్థాయిలో తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇక.. ఇరు దేశాల మధ్య శాంతికి భారత్ అంగీకరించే పరిస్థితులు కనిపించట్లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే... ఇరు దేశాల మధ్య సయోధ్యకు ఆ దేవుడే సహకరించాలని కోరుకుంటున్నట్లు ఆసిఫ్ తెలిపారు.
7వ రాత్రి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన!:
జమ్మూకశ్మీర్ లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సమీపంలోని నియంత్రణ రేఖ వెంబడి బుధవారం వరుసగా ఏడో రాత్రి కూడా పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో... పాక్ కాల్పులకు భారత సైన్యం ధీటుగా స్పందించింది. మరోపక్క అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పరాహ్వాల్ సెక్టార్ లోనూ కాల్పులు జరిపింది.
వాస్తవానికి కాల్పుల విరమణ ఉల్లంఘనల పరిష్కారానికి ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ మంగళవారం హాట్ లైన్ లో సంభాషించారు. అయినప్పటికీ పాక్ వైఖరి మారలేదు.
