Begin typing your search above and press return to search.

అక్కడంతా శ్మశాన వైరాగ్యం..పుట్టి బుద్దెరిగి...!

పాకిస్తాన్ పుట్టుకే ఒక తప్పుడు సూత్రం మీద జరిగింది. ఏ దేశం అయినా ప్రాంతం అయినా ఆఖరుకు కుటుంబం అయినా సమిష్టిగానే సాగాలి.

By:  Tupaki Desk   |   7 May 2025 10:00 PM IST
అక్కడంతా శ్మశాన వైరాగ్యం..పుట్టి బుద్దెరిగి...!
X

పాకిస్తాన్ పుట్టుకే ఒక తప్పుడు సూత్రం మీద జరిగింది. ఏ దేశం అయినా ప్రాంతం అయినా ఆఖరుకు కుటుంబం అయినా సమిష్టిగానే సాగాలి. మతం పేరుతో ఒక దేశం ఏర్పాటు కావడం అన్నది ప్రకృతి విరుద్ధమైనది. అలా పాక్ ఒక విష పుత్రికగా నాడు అవతరించేందుకు ఆనాటి నాయకులు చేసిన కుటిల యత్నాలు ఫలించాయి.

గడచిన ఏడున్నర దశాబ్దాల కాలంలో పాక్ ఏ విధంగానూ ఎదిగిందీ లేదు, ప్రగతి వికాసాన్ని చూసింది లేదు. ఎంతసేపూ భారత్ మీద ఏడుస్తూ కుళ్ళు బుద్ధితో రగిలిపోవడం తప్ప. ఇక పాక్ ఈ రోజుకీ ఒక దేశంగా ఉండడానికి కారణాలు అనేకం ఉన్నాయి. భారత్ మీద కక్షతో ఇతర దేశాలు పాక్ ని దాని భారత్ అసూయని వాడుకుని ఆ గడ్డను గుత్తంగా తీసుకుని శత్రువుల వేదికగా మార్చడం. దీని వల్ల తాత్కాలికంగా పాక్ నిలబడి ఆర్థికంగా ప్రయోజనాలు పొందింది.

ఇక మరో వైపు వారి కోసం తయారు చేసిన ఉగ్ర తండాలను వారిచ్చే సాయంతో సిద్ధం చేసిన ఈ టెర్రరిస్టు మూకలను భారత్ మీదకు పంపించి ఆనందించడం. దాని వల్ల కూడా పాక్ ఒక రకమైన పైశాచిక ఆనందాన్ని పొందుతూ వచ్చింది. మరో వైపు చూస్తే భిన్న రాజకీయ వాదనలు విధానాలతో సాగే భారత్ లో కొంత సందిగ్ధత, మరి కొంత మెతక వైఖరి కారణంగా కూడా భారత్ వంటి పెద్ద దేశం మీద పాక్ చెలరేగి పోవడానికి ఆస్కారం ఏర్పడింది.

భారత్ లోని జన సమూహాల్లో కీల ప్రదేశాల్లో ఎక్కడా తేడా లేకుండా ఉగ్ర దాడులు జరుగుతూ వందలలో అమాయక ప్రజల ప్రాణాలు పోతూంటే పాక్ ఆనందించింది. పాక్ మీద ఏ విధంగా సమరం చేయాలి. ఎలా పీచమణచాలి అన్న దాని విషయంలో భారత్ గతంలో కొంత ఆలోచిస్తూ నెమ్మదిగా ముందుకు సాగడమే ఈ ఉగ్ర ఊతానికి భూతానికి అవకాశం ఇచ్చినట్లు అయింది.

అయితే కాలం ఎపుడూ ఒక్కలా ఉండదు. ఇపుడు భారత్ ఒక ఉన్న రాజకీయ నాయకత్వం కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ఒక దెబ్బకు పది అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు పాక్ ఆనుపానులు అన్నీ కూడా గుర్తించి మరీ కీలెరిగి వాత పెడుతున్నారు. దాంతో దాయాదికి దిక్కులు చూడడం తప్ప మరో మార్గం లేకపోతోంది.

ఇంట గెలిచి రచ్చ గెలవడం ఒక విజయ సూత్రం. భారత్ రచ్చను ఇంటనూ ఒకేసారి గెలిచి పాక్ ఆట కట్టిస్తోంది. దాంతో పాక్ లోని ఉత్ర తండాల మీద భారత్ చేసిన దాడులకు ఏ దేశమూ బాహాటంగా మద్దతు ఇవ్వలేని పరిస్థితి. భారత్ ని ఈ రోజుకీ ద్వేషించి ఒకటి రెండు దేశాలు తప్ప పాక్ కి అంతర్జాతీయంగా అండగా ఉండే వారు కరవు అయ్యారు.

దాంతో పాక్ బిక్కు బిక్కుమంటోంది. తమాషాగా భారత్ ని కెలకాలనుకున్న వెన్నులో వణుకు పుట్టేల ఉంది. ఇక పాక్ లో తొమ్మిది చోట్ల ఉగ్ర తండాలను సర్వ నాశనం చేసిన భారత సైన్యం పాక్ తన సొంత గడ్డ మీద చేయాల్సింది ఏమిటో అది మరచిపోతే తామే వచ్చి ఏమి చేసి చూపించామో లోకానికి స్పష్టపరచింది.

ఇపుడు పాక్ పరిస్థితి ఎలా ఉంది అంటే ఉగ్ర మూకలు కూలిన చోట గట్టిగా బయట పడి ఏడవలేదు. ఏడిస్తే ఆ ఉగ్ర మూకలకు తామే మద్దతు అన్నది లోకానికి తెలిసిపోతుంది. అలాగని దశాబ్దాలుగా వారిని పెంచి పోషినుకుంటూ దాని వల్లనే తన మనుగడ సాగిస్తున్న వైనాన్ని దైన్యాన్ని మరవులేకుంది. అందుకే పాక్ ముంగిట ఇపుడు భయంకరమైన శ్మశాన నిశ్శబ్దం తాండవిస్తోంది

భారత్ వంటి పెద్దన్న అంతర్జాతీయంగా ఈ రోజు కీలకంగా ఉన్న బలమైన దేశాన్ని కెలికితే ఏమవుతుందో పాక్ కి అక్షరాల కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఈ దెబ్బతో మైండ్ బ్లాంక్ అయి బుద్ధి రావాలి. అది వస్తుందో రాదో తెలియదు కానీ పాక్ అన్న దేశం పుట్టి బుద్దెరిగి ఇంతటి ఘోర గుణపాఠాన్ని చూసి ఉండదు అన్నది మాత్రం అక్షరాలా పచ్చి నిజం.

ఇకనైనా ఒక దేశంగా పాక్ మారుతుందన్న ఆశలు ఎవరికీ లేవు. అదే సమయంలో పాక్ ఉగ్ర మూకలతో తన అక్రమ సంబంధాలను కొనసాగించక ఆగుతుందని కూడా ఎవరూ అనుకోవడం లేదు అందుకే ఇది ఆరంభం. పాక్ అన్న దానిని ఈ ప్రపంచ మ్యాప్ మీద ఉంచాలా తుంచాలా అన్నది పాక్ అనుసరించే వైఖరి బట్టే ఉంటుంది. ఆ మీదట ఏమి జరిగినా ఎవరిదీ బాధ్యత అయితే కాదు. పాక్ చేతిలోనే అంతా ఉంది అన్నది నిఖార్సు అయిన వాస్తవం.