ఆటలో ఓడాం... యుద్ధం గెలిచాం... పాక్ క్రికెటర్ భార్య నోటి దూల
భారత్ తో మైదానంలోనే కాదు యుద్ధంలోనూ గెలవలేని దేశం పాకిస్థాన్. ఇప్పటికి మూడునాలుగు సార్లు ఈ విషయం రుజువైంది.
By: Tupaki Desk | 22 Sept 2025 10:10 PM ISTపిచ్చోళ్ల గురించి వినడమే కానీ.. లైవ్ లో చూడడం ఇదే మొదటిసారి.. ఓ సినిమాలో బ్రహ్మానందం జోక్ ఇది...! సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ జోక్ ను వివిధ సందర్భాల్లో వినియోగించుకుంటూ నెటిజన్లు ఓ తమకు ఇష్టం లేని వారిని ఓ ఆట ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు పాకిస్థాన్ క్రికెటర్ భార్యను చూసి మనం ఇదే మాట అనుకోవాలి. ఎందుకంటే ఆమె ప్రేలాపనలు అలా ఉన్నాయి మరి...!
పైచేయి అంతా భారత్ దే అయినా...
భారత్ తో ఆదివారం జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ చిత్తుగా ఓడినది అందరూ చూశారు. మనవాళ్లు కాస్త కూడా తడబాటు లేకుండా గెలిచారు. కొన్ని క్యాచ్ లు మిస్ కావడం మినహా.. మ్యాచ్ లో భారత్ దే పూర్తి ఆధిపత్యం. పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తున్నప్పటికీ పాకిస్థాన్ ను కేవలం 171 పరుగులకే కట్టడి చేశారు. మరో ఏడు బంతులు ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. ఇంతగా ఆధిపత్యం చెలాయించినా పాక్ క్రికెటర్లకు బుద్ధి రాలేదు. మ్యాచ్ లో వారి హావభావాలు, చేసిన సంజ్ఞలు జుగుప్స కలిగించాయి. ఇలాంటి కవ్వింపులుకు భారత బ్యాటర్లు బుద్ధిచెప్పారు కూడా.
యుద్ధంలో గెలిచారట...
భారత్ తో మైదానంలోనే కాదు యుద్ధంలోనూ గెలవలేని దేశం పాకిస్థాన్. ఇప్పటికి మూడునాలుగు సార్లు ఈ విషయం రుజువైంది. పాకిస్థాన్ మద్దతుతో పెహల్గాంలో అత్యంత దారుణంగా పర్యటకులపై చేసిన దాడికి ప్రతీకారం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ మినీ యుద్ధంలో పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. లేదంటే ఎక్కడ ఓడిపోతామోనని భయపడింది. ఇదంతా ప్రపంచం అంతా చూసింది. కానీ, ఆ యుద్ధంలో పాకిస్థాన్ గెలిచిందని అంటోంది పాక్ పేస్ బౌలర్ హారిస్ రవూఫ్ భార్య ముజ్నా మసూద్.
ఇక ఆదివారం నాటి మ్యాచ్ లో పాక్ పేసర్ రవూఫ్.. చేతి వేళ్లతో చేసిన సంజ్ఞలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందన్నట్లు ఈ సంజ్ఞలు ఉన్నాయి. రవూఫ్ భార్య ముజ్నా మసూద్ తన భర్త చేష్టలను సమర్థించింది. గేమ్ లో ఓడిపోయాం.. యుద్ధంలో గెలిచాం అంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. దీన్ని చూసి భారత అభిమానులు మండిపడుతున్నారు. పాకిస్థాన్ పై ఎప్పటికీ భారత దేశానిదే విజయం.. అది యుద్ధమైనా.. క్రికెట్ అయినా.. అంటూ ప్రతిస్పందిస్తున్నారు.
పాక్ పేసర్ హారిస్ రవూఫ్ కు 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తాడనే పేరుంది. కానీ, అతడు పరుగులు ధారాళంగా ఇచ్చేస్తాడు. మూడేళ్ల కిందట ప్రపంచ కప్ లో అతడి బౌలింగ్ లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్ ముగింపులో ముందుకొచ్చి మరీ సిక్స్ కొట్టాడు. అభిమానులు ఈ ఇన్నింగ్స్ ను గుర్తుచేస్తూ హారిస్ ను తీసిపడేస్తుంటారు.
