ఇరాన్ పై అమెరికా దాడి... పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు!
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇచ్చింది.
By: Tupaki Desk | 22 Jun 2025 6:55 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలోకి తాజాగా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా.. ఇరాన్ లోని మూడు కీలక అణుశుద్ధి కేంద్రాలపై దాడులు చేసింది. ఈ సందర్భంగా మిషన్ సక్సెస్ అంటూ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. ఈ ఘటనపై పాకిస్థాన్ స్పందించింది. కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... నోబెల్ శాంతి బహుమతి - 2026కి ట్రంప్ పేరును పాకిస్థాన్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన ఒక రోజు అనంతరం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా స్పందించిన పాక్.. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులను ఖండించింది. దీనివల్ల ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని పేర్కొంది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టంలోని అన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం తనను తాను రక్షించుకునే చట్టబద్ధమైన హక్కు ఇరాన్ కు ఉందని పాకిస్థాన్ తెలిపింది.
ఇదే సమయంలో... ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య శత్రుత్వాన్ని వెంటనే ముగించాలని కోరిన పాకిస్థాన్... సైనిక తీవ్రత కాదు, దౌత్యమే శాంతికి స్థిరమైన మార్గం అని నొక్కి చెప్పడం గమనార్హం. ఈ ప్రాంతంలో సంక్షోభాలను పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలు మాత్రమే ఆచరణీయ మార్గం అని పాకిస్థాన్ చెప్పుకొచ్చింది.
ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన వల్ల ఉద్రిక్తతలు మరింత పెరగనున్నాయని తెలిపింది. కాగా... ఇరాన్ తో 900 కిలోమీటర్లకుపైగా సరిహద్దును పంచుకునే పాకిస్తాన్ తాజా వ్యాఖ్యలు ఇరాన్ కు మద్దతుగా మాత్రమేనా.. లేక, ట్రంప్ చర్యను పూర్తిగా ఖండిస్తున్నట్లా అనే స్పష్టత కొరవడిందని అంటున్నారు!
కాగా వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును అధికారికంగా నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు ట్రంప్ వైట్ హౌస్ లో ఆతిథ్యం ఇచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వెలువడింది.
