1971, 99 లోనే చేసుకున్నప్పుడు ఇదొక లెక్కా షరీఫ్?
అవును... ఇస్లామాబాద్ లో పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సేఫ్ హౌస్ కి తరలివెళ్లినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 May 2025 11:47 AM ISTగత మూడు రోజులుగా జరిగిన భారత్ – పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు శనివారం సాయంత్రం తెరపడిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు దేశాలు క్లారిటీ ఇచ్చాయి. ఈ సందర్భంగా స్పందించిన పాక్ ప్రధాని... ఇది తమ చారిత్రక విజయమని అన్నారు. దీంతో.. 1971, 1999 పేపర్ కటింగ్స్ గుర్తు చేస్తూ.. పాక్ కు ఇది ఒక లెక్కా అని స్పందిస్తున్నారు నెటిజన్లు!
అవును... ఇస్లామాబాద్ లో పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సేఫ్ హౌస్ కి తరలివెళ్లినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. కాల్పుల విరమణ అనంతరం ఆయన మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. భారత్ తో యుద్ధంలో తాము విజయం సాధించామని.. ఇది చారిత్రక విజయమని అన్నారు.
ఇదే సమయంలో... తమ దేశాన్ని, తమ పౌరులను రక్షించుకోవడానికి తాము ఏం చేసేందుకైనా వెనుదిరిగేది లేదని.. పాకిస్థాన్ ను ఎవరైనా సవాల్ చేస్తే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని ఆయన... భారత్ కు తగిన బుద్ది చెప్పామని, తమ జోలికి వస్తే ఏం చేయగలమో చేసి చూపించామని చెప్పుకుంటున్నారు!
ఈ నేపథ్యంలోనే గతంలో భారత్ చేతిలో పాక్ చిత్తు చిత్తు అయినప్పటి సంఘటనలు గుర్తు చేస్తూ.. అప్పుడు కూడా అక్కడి పత్రికల్లో వచ్చిన కథనాలను జ్ఞప్తికి తెస్తున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా... ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన 1971 యుద్ధంలో పాక్ ను భారత సైన్యం చిత్తు చిత్తు చేసింది. దీంతో.. పాక్ సైన్యం తలవంచింది.
ఆ యుద్ధంలో గెలిచిన భారత్.. బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చేలా చేసింది. ఈ సమయంలో మరో దేశమైతే దలదించుకుని ఉండేదేమో.. లేక, ఓటమిని స్వదేశంలోనూ ఒప్పుకునేదేమో! కానీ పాకిస్థాన్ మాత్రం అక్కడి పత్రికల్లో... "విజయం సాధించే వరకూ యుద్ధమే" అని రాసుకుంది. ఆ విజయం ఏమిటో.. యుద్ధం ఎవరిపైనో వారికే తెలియాలి!
ఇక 1999 కార్గిల్ యుద్ధం విషయానికొస్తే... పాక్ ను మరోసారి భారత్ చిత్తు చేసింది. అప్పుడు కూడా పాక్ వ్యవహారశైలి ఇలానే ఉంది. భారత్ లో తల వంచడం.. స్వదేశానికి వెళ్లి కాలర్ ఎగరేయడం అక్కడి నేతలకు పరిపాటిగా మారింది! ఇక తాజాగా భారత్ బలహీనతో, అమెరికా చాణక్యమో, పాక్ వ్యూహమో తెలియదు కానీ.. యుద్ధం ఆగింది!
దీంతో.. ఇప్పుడు కూడా అదే తరహా ప్రకటనలు చేస్తుంది పాక్! ఇందులో భాగంగా... తమకు భయపడే భారత్ సీజ్ ఫైర్ చేసుకుందని కూస్తుంది. ఇదే సమయంలో... తమ ఆపరేషన్ మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగిందని, ఇది తమ సూత్రాల విజయమని.. ఇది సాయుధ దళాలకు మాత్రమే కాదు.. మొత్తం దేశానికే విజయమని షరీఫ్ చెప్పుకుంటున్నారు!
