Begin typing your search above and press return to search.

పాక్ మరో ఫేక్ ప్రచారానికి చైనా తందానతాన... అంత సీన్ లేదన్న భారత్!

గత రెండు రోజులుగా భారత ఆపరేషన్ సిందూర్ కి ప్రతీకారంగా దాడులు మొదలుపెట్టింది పాక్. ఇందులో భాగంగా భారత్ పైకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తుంది.

By:  Tupaki Desk   |   10 May 2025 11:39 AM IST
పాక్ మరో ఫేక్ ప్రచారానికి చైనా తందానతాన... అంత సీన్ లేదన్న భారత్!
X

పాకిస్థాన్ లోని ఉగ్రవాదులే లక్ష్యంగా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ దాడిలో 9 ఉగ్రశిబిరాలు, 100 కు పైగా ఉగ్రమూకలు నాశనమయ్యాయి. 25 నిమిషాల్లో ఆ పని పూర్తి చేసి పౌరులకు, సైనిక స్థావరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి స్వదేశానికి వచ్చేసింది భారత సైన్యం.

ఈ షాక్ నుంచి కాస్త తేరుకుందో ఏమో కానీ... తమ సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది పాక్. ఇందులో భాగంగా.. భారత్ ఆపరేషన్ ను పాక్ సక్సెస్ ఫుల్ గా తిప్పికొట్టిందని.. భారత యుద్ధ విమానాలు ఐదింటిని పాక్ సైన్యం కూల్చివేసిందని చెప్పుకున్నారు. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా చైనా ప్రభుత్వ మీడియా రంగంలోకి దిగిపోయింది.

పాక్ మొదలుపెట్టిన ఆ ఆత్మవంచనతో కూడిన ఫేక్ ప్రచారానికి సాల్ట్, పెప్పర్ వేసి అధికారిక మీడియాలో ప్రసారం చేసేసింది. దీనిపై పాక్ రక్షణ మంత్రిని మీడియ ప్రశ్నిస్తే.. సోషల్ మీడియాలో అలానే ఉందని చెప్పుకుని, ప్రపంచం ముందు కార్టూన్ అయ్యారు! ఈ సమయంలో మరోసారి పాక్ ఫేక్ ప్రచారం మొదలుపెడితే.. చైనా తందానతాన!

అవును... గత రెండు రోజులుగా భారత ఆపరేషన్ సిందూర్ కి ప్రతీకారంగా దాడులు మొదలుపెట్టింది పాక్. ఇందులో భాగంగా భారత్ పైకి డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తుంది. ఈ సమయంలో భారత అమ్ముల పొదిలోని అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400.. పాక్ ప్రయత్నాలను తునాతునకలు చేసేస్తుంది.

ఆ రాడార్ రేంజ్ సుమారు 600 కిలో మీటర్లు కాగా.. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్లు, రాకెట్లు, మానవరహిత విమానాలను కూల్చేసే ఒక వ్యవస్థ ఇది. అలాంటి పవర్ ఫుల్ వ్యవస్థను పాక్ కు చెందిన జేఎఫ్-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పీటీవీ ప్రచారం మొదలుపెట్టింది.

ఈ దాడి పంజాబ్ లోని ఆందంపూర్ వద్ద జరిగినట్లు చెప్పుకుంది. ఇంకే ముంది పాక్ ఐరన్ బ్రదర్ చైనా తందానతాన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. తమ ప్రభుత్వరంగానికి చెందిన మీడియా సంస్థ తో పాటు గ్లోబల్ టైమ్స్ సహా పలు మీడియా సంస్థలు ఆన్ లైన్ లో అచ్చేసి వదిలేశాయి. ఆన్ లైన్ లో హడావిడి మొదలుపెట్టాయి.

ఈ ఆత్మవంచన కమ్ ఫేక్ కమ్ విష ప్రచారంపై వెంటనే భారత మిలటరీ విభాగం స్పందించింది. జేఎఫ్-17 హైపర్ సోనిక్ క్షిపణితో భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఒకటైన ఎస్-400ను ధ్వంసం చేసినట్లు పాక్ చేస్తున్న ప్రచారం తప్పని.. అది పూర్తిగా ఫేక్ అని భారత సైనికాధికారులు వెల్లడించారు. పాక్ కు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పారు.