Begin typing your search above and press return to search.

కాల్పుల విరమణ ఉల్లంఘన వేళ.. పాక్ కు చైనా బాసట!

తాజా పరిస్థితుల్ని చైనా విదేశాంగ మంత్రికి పాక్ మంత్రి వివరించినట్లుగా పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది.

By:  Tupaki Desk   |   11 May 2025 10:32 AM IST
కాల్పుల విరమణ ఉల్లంఘన వేళ.. పాక్ కు చైనా బాసట!
X

ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసినప్పుడు ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. భారత - పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్ పెట్టేందుకు తాను ఇరు వర్గాలతో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేయటం.. కాసేపటికే పాక్ సానుకూలంగా స్పందించటం.. కొద్ది నిమిషాల వ్యవధిలో భారత ప్రతినిధి మీడియా ముందుకు వచ్చి.. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణను పాటిస్తున్నట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

ట్రంప్ మధ్యవర్తిత్వం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం జరిగిన విషయం బయట ప్రపంచానికి వెల్లడించిన కొద్ది గంటలకే పాక్ తన పాడు బుద్దిని మరోసారి ప్రదర్శించింది. భారత సరిహద్దు రాష్ట్రాల్లో మళ్లీ డ్రోన్ దాడుల్ని చేపట్టింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పాక్ దాడుల్ని తిప్పి కొట్టింది. అప్పటివరకు శాంతియుత వాతావరణ రెండు దేశాల మధ్య నెలకొందన్న భావన కలిగినప్పటికీ.. పాక్ తన తీరును మరోసారి ప్రదర్శించటంతో ఈసారి భారత్ దానికి బలంగా బదులు చెప్పాలన్న వాదన మొదలైంది.

ఇలాంటి పరిస్థితుల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గే వేళలో డ్రాగన్ దేశం ఎంట్రీ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. పాక్ దాడులు మొదలు పెట్టిన కాసేపటికే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడారు. పాక్ తన సౌర్వభౌమాధికారాన్ని.. ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవటంలో ఆ దేశానికి అండగా నిలుస్తామన్న ఆభయాన్ని ఇవ్వటం గమనార్హం.

తాజా పరిస్థితుల్ని చైనా విదేశాంగ మంత్రికి పాక్ మంత్రి వివరించినట్లుగా పాక్ విదేశాంగ శాఖ కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని పాక్ ఉటంకించింది. అందులో సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాక్ సంయమనంతో ఉందని.. బాధ్యతాయుత విధానాన్ని అనుసరించినట్లుగా చెప్పటం చూస్తే.. చైనా ప్లానింగ్ ఇట్టే అర్థమవుతుంది.

భారత - పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిన చైనా.. ఎప్పుడైతే అమెరికా ఎంట్రీ ఇచ్చి.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పించారో.. ఆ వెంటనే చైనా సీన్లోకి వచ్చింది. పాక కు మద్దతుగా నిలుస్తామని చెప్పటం కనిపిస్తుంది. ఇదంతా చూస్తే.. చైనాకు భారత్ మీద కంటే కూడా అమెరికా పెద్దమనిషిగా మారి.. ఇరు దేశాల మధ్యనున్న ఉద్రిక్త వాతావరణాన్ని చక్కదిద్దటం ఏ మాత్రం ఇష్టం లేనట్లుగా ఉందంటున్నారు. ఇందుకు తగ్గట్లే.. చైనా ఎంట్రీ ఇవ్వటం.. దానికి తగ్గట్లే.. పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడిచేలా దాడులకు పాల్పడినట్లుగా చెబుతున్నారు.