అట్టుంటాది చైనా సరుకుతో... పాక్ కు రాడార్ల వరుస దెబ్బలు!
అవును... తాజాగా పీవోకేతో పాటు నేరుగా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోనూ భారత్ సైన్యం దాడులు చేసింది.
By: Tupaki Desk | 8 May 2025 3:28 PM ISTపాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లలో ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన దాడులు సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాక్ ఉగ్రవాదులు 100 మంది వరకూ చనిపోయారని భారత్ ప్రభుత్వం ధృవీకరించింది! ఈ సమయంలో పాక్ నమ్ముకున్న చైనా రాడార్ పెర్ఫార్మెన్స్ పై ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
అవును... తాజాగా పీవోకేతో పాటు నేరుగా పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రాంతంలోనూ భారత్ సైన్యం దాడులు చేసింది. అయితే ఈ వైమానిక దాడులను గుర్తించడంలో పాక్ వాడుతున్న చైనా రాడార్ల వ్యవస్థ పూర్తిగా విఫలమైందని అంటున్నారు. అయితే.. చైనా రాడార్ వ్యవస్థలతో పాక్ దెబ్బతినడం ఇదే తొలిసారి కాదు. ఫెయిల్యూర్ ఫునరావృతం అవుతూనే ఉంది!
వాస్తవానికి 2019 బాలకోట్ వైమానిక దాడి సమయంలో.. పాక్ రాడార్ వ్యవస్థ కవరేజ్ పూర్తిగా ఫెయిలైంది. దీంతో... చైనా నుంచి వాయు రక్షణ వ్యవస్థలను అత్యవసరంగా కొనుగోలు చేసింది ఇస్లామాబాద్. అయితే... 2022 మార్చి9న హర్యానాలోని అంబాలా నుంచి అనుకోకుండా సూపర్ సోనిక్ బ్రహ్మాస్ క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించడం జరిగింది!
ఆ క్షిపణి భారత గగనతలంలో 100 కిలోమీటర్లు, పాకిస్థాన్ భూభాగంలో మరో 105 కి.మీ. ప్రయాణించి నేరుగా పంజాబ్ ప్రావిన్స్ లోని మియాన్ చన్నులో కూలిపోయింది. అయితే... ఇలా భారత క్షిపణి తమ భూభాగంలో సుమారు 105 కిలోమీటర్లు ప్రయాణించినప్పటికీ ఏ దశలోనూ పాకిస్థాన్ రాడర్ ఈ క్షిపణిని గుర్తించలేదు!
ఈ ఘటనపై పాక్ సైన్యం బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎల్.వై-80 వ్యవస్థలోని 388 లోపాల జాబితాను చైనాకు అందజేసింది. అందులో 285 లోపాలు గతంలోనే నివేదించబడగా.. 103 కొత్తగా కనుగొనబడ్డాయి. ఇదే సమయంలో వీటిలో 255 లోపాలను తక్షణం పరిష్కరించాలని వర్గీకరించాయి.. దీంతో పాక్ రాడార్ల పనితీరు ప్రశ్నార్థకంగా మారింది.
కాగా... తమ సైన్యంలో చేర్చబడిన ఎల్.వై.-80 (లో టూ మీడియం ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) వ్యవస్థ 15 మీటర్ల నుంచి 18 కిలోమీటర్ల ఎత్తులో, 40 కిలోమీటర్ల పరిధిలో క్షిపణులు, విమానాలను అడ్డగించగలదని.. దీని రాడార్ భాగం 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగలదని అప్పట్లో పాక్ చెప్పుకుంది.
