పాక్ అర్మీ చీఫ్ కోరికను ఆ దేశ ప్రధాని టెంపరరీగా చంపేశారా?
ఈ సమయంలో అతడి మనసులో ఉన్నట్లు చెబుతున్న ఓ కోరిక విషయంలో ఆదేశ ప్రధాని వ్యూహాత్మక స్ట్రోక్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
By: Tupaki Desk | 13 July 2025 9:00 PM ISTపాకిస్థాన్ కు అధ్యక్షుడు ఉన్నారు, ప్రధాని ఉన్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది! అయినప్పటికీ అక్కడ అంతా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అని.. అతడు ఆ దేశానికి అనధికారిక నియంత అని.. అతడు బొమ్మ అంటే బొమ్మ, బొరుసు అంటే బొరుసు అన్నట్లుగా పాలన సాగుతుంటుందని అంటారు. ఈ సమయంలో అతడి మనసులో ఉన్నట్లు చెబుతున్న ఓ కోరిక విషయంలో ఆదేశ ప్రధాని వ్యూహాత్మక స్ట్రోక్ ఇచ్చినట్లు తెలుస్తొంది.
అవును... పాకిస్థాన్ అనధికారిక నియంతగా ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యవహరిస్తారని.. ఆ దేశంలో ఆర్మీని అంత శక్తి ఉంటుందని.. సాధారణంగా ఒక దేశానికి ఆర్మీ ఉంటే.. పాకిస్థాన్ విషయంలో మాత్రం ఆర్మీకి ఒక దేశం ఉందని చెబుతారు. దీంతో... పాకిస్థాన్ కు ప్రెసిడెంట్ కావాలని ఆసిఫ్ మునీర్ కలలు గంటున్నారని.. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ను గద్దె దింపాలని భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది!
ఇలా... పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని గద్దె దింపేసి.. ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆ పదవిని చేపట్టాలని భావిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్ట్రాంగా రియాక్ట్ అయ్యారు. ఆ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా.. అవన్నీ కేవలం వదంతులేనంటూ కొట్టిపారేశారు. జర్దారీ ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగుతారన్నారు. దీంతో.. ఈ వ్యాఖ్యలు మునీర్ కి షాక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో... అసిమ్ మునీర్ ఏనాడు దేశాధ్యక్ష పదవిపై ఆసక్తి వ్యక్తం చేయలేదని.. ప్రస్తుతానికి అటువంటి ప్రణాళిక కూడా ఏదీ లేదని పాక్ ప్రధాని స్పష్టం చేశారు. మునీర్, జర్దారీ మధ్య సానుకూల సంబంధాలున్నాయని.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవముందని.. పాకిస్తాన్ అభివృద్ధి, పురోగమనమే వీరిద్దరి లక్ష్యం అని చెప్పుకొచ్చారు.
ఇదే విషయంపై అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి మొహ్సిన్ నక్వీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... జర్దారీ, మునీర్, షరీఫ్ లే లక్ష్యంగా తప్పుడు జరుగుతోందని.. దీని వెనుక విదేశీ శక్తులున్న సంగతి తమకు తెలుసని.. జర్దారీ స్థానంలో ఆర్మీ చీఫ్ మునీర్ రానున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తి అసత్యాలని అటువంటి యోచన లేదని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది.
ఇందులో భాగంగా... పాక్ కి ప్రెసిడెంట్ అవ్వాలనేది మునీర్ వ్యూహంగా, కోరికగా భావించిన పాక్ ప్రధాని, ఆయన కేబినెట్ లోని మంత్రులు ఈ విధంగా ముందస్తు వ్యూహంలో భాగంగా... ఈ ప్రచారం సృష్టించి, వారే దానికి ఖండిస్తూ మునీర్ కి వ్యూహాత్మక స్ట్రోక్ ఇచ్చినట్లున్నారనే ప్రచారం మొదలైంది. ఏది ఏమైనా... ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ లో రాజకీయ వాతావరణం సరికొత్త మలుపుల దిశగా ప్రయాణిస్తుందనే చర్చ మాత్రం నడుస్తోంది.
