Begin typing your search above and press return to search.

ఉగ్ర దాడి వెనక పాక్ ప్రమేయం ?

జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రెండు మూడు రోజుల క్రితం విషం చిమ్మారు. విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   22 April 2025 10:12 PM IST
ఉగ్ర దాడి వెనక పాక్ ప్రమేయం ?
X

జమ్మూ అండ్ కాశ్మీర్ మీద పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ రెండు మూడు రోజుల క్రితం విషం చిమ్మారు. విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ చీఫ్ జనరల్ అసీం మునీర్ కాశ్మీర్ సోదరులను మేము వదిలేయమని అంటూ భారత్ మీద అక్కసు వెళ్ళగక్కారు. కాశ్మీర్ సోదరుల కోసం నిరంతరం పోరాడుతుంటామని కూడా ఆయన అన్నారు. అంతే కాదు కాశ్మీర్ మాకు జీవ నాడి లాంటిది అని అన్నారు.

ఆయన వ్యాఖ్యలు అలా చేశారో లేదో కొద్ది రోజులలోనే ఈ ఉగ్ర దాడి జరిగింది. అంటే దీని వెనక పాకిస్థాన్ ప్రమేయం ఉందా అన్న కోణంలో చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే లష్కరే తోయిబా అన్న ఉగ్ర సంస్థకు అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్శ్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఈ ఉగ్ర దాడిని తామే చేశామని ప్రకటించింది.

ఇక పాక్ చరిత్ర చూస్తే కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది అన్నది ఉంది. అంతే కాదు కాశ్మీర్ లో జరిగే ఉగ్ర దాడులలో లష్కరే తోయీబా, జైషే మహ్మద్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలు ఎపుడూ పాలుపంచుకుంటూ ఉన్నాయి. వాటికి పాక్ మద్దతు ప్రోత్సహం ఉన్నాయని కూడా చెబుతారు.

ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంతటా కూడా పాక్స్థాన్ అయితే ఏకంగా ఉగ్రవాద శిబిరాలనే పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది అన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి చూస్తే కాశ్మీర్ లోపల అయితే ఉగ్రవాదులు తగ్గిపోయారు అని చెప్పాలి. అయితే పాక్ నుంచి వచ్చిన ఉగ్ర మూకలే ఇంకా కాశ్మీర్ లో ఉన్నాయని పోలీసులు భారత ఆర్మీ గుర్తించి చెబుతోంది. అలాంటి వారి సంఖ్య డెబ్బై నుంచి ఎనభై మంది దాకా ఉందని అంటోంది.

వారంతా అదను చూసి పాకిస్థాన్ బోర్డర్ దాటి అడవులు కొండలు దాటి మరీ కాశ్మీర్ లోకి ప్రవేశించారు అని అంటున్నారు. వీరు సరైన సమయం కోసం చూస్తున్నారని అలా వారు వేసిన ప్లాన్ లో భాగమే ఈ ఉగ్ర దాడి అని అంటున్నారు. ఇదిలా ఉంటే పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడిలో భారత దేశస్థులతో పాటు ఇజ్రాయిల్, ఇటలీ దేశాలకు చెందిన టూరిస్టులు కూడా మరణించార్ని అంటున్నారు.

ఏది ఏమైనా మొత్తం భారత దేశాన్నే కుదిపేసే ఉగ్ర దాడిగా దీనిని చూస్తున్నారు. ఈ దాడికి ధీటైన జవాబు భారత్ చెప్పాలన్న డిమాండ్ కూడా వస్తోంది. భారత్ లో కాశ్మీర్ అంతర్భాగం అని ప్రకటించాక కూడా ఇంకా మా సోదరులు అంటూ పాక్ ఆర్మీ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంతో పాటు ఈ విధంగా మళ్లీ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు.