Begin typing your search above and press return to search.

ఊహించని అభ్యర్ధితో బీజేపీ బిగ్ ట్విస్ట్ !

ఇపుడు పాకా వెంకట సత్యనారాయణకు పెద్దల సభలో అవకాశం ఇవ్వడం ద్వారా బీజేపీ తమది క్యాడర్ బేస్డ్ పార్టీ అని గట్టిగా చాటుకుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 April 2025 10:22 PM IST
ఊహించని అభ్యర్ధితో బీజేపీ బిగ్ ట్విస్ట్ !
X

బీజేపీ నుంచి ఫలనా వారు రాజ్యసభకు ఎంపిక అవుతారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎన్నో పేర్లు తెర మీదకు వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మాజీ మంత్రులు కీలక నేతలు పొరుగున ఉన్న అన్నా మలై అలాగే తెలంగాణా నుంచి మంద క్రిష్ణ మాదిగ అనేక మైన పేర్లతో ప్రచారం ఒక స్థాయిలో జరిగింది.

వీరిలో ఎవరో ఒకరికి రాజ్యసభ చాన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బీజేపీ తేడా గల పార్టీ కదా. అందుకే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది తమ పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్ లో నుంచి పనిచేస్తూ అసలైన బీజేపీ నేతగా గుర్తింపు పొందిన వారిని ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ఆయన పేరు ఎక్కడా ఏ దశలోనూ ప్రచారంలో లేకపోవడం విశేషం. బీజేపీ నుంచి కూటమి తరఫున మంగళవారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్న అభ్యర్ధి పాకా వెంకట సత్యనారాయణ. ఆయన గోదావరి జిల్లాలకు చెందిన నాయకుడు.

ఆయన బీజేపీలో నాలుగు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఆయన అతి సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజున ఈ స్థాయికి వచ్చారు. ఆయన భీమవరం మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేశారు. ఆయన పార్టీలో కీలక నేతగా నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసేవారుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన పేరుని గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి అలాగే, ఎమ్మెల్సీ పదవికి కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది.

ఇక ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు ఆయన పేరుని పార్టీ బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశమై పరిశీలించి చివరికి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం యూరప్‌ పర్యటనలో ఉన్నప్పటికీ ఆమె వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశంలో పాల్గొని ఆయన పేరుని ఎంపిక చేశారు. అనంతరం పార్టీ జాతీయ నాయకత్వం ఆయన పేరును ఎన్డీయే అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది.

ఇదిలా ఉంటే ఆర్ ఎస్ ఎస్ నేపధ్యంతో పాటు నిబద్ధత కలిగి పార్టీకి పనిచేసిన వారికే పదవులు ఇస్తామని మరోమారు బీజేపీ ఈ ఎంపిక ద్వారా బలమైన సందేశం పంపించింది అని అంటున్నారు. కేంద్ర మంత్రి పదవికి భీమవరం ఎంపీ శ్రీనివాసవర్మకు ఇచ్చిన అధినాయకత్వం అలాగే ఎమ్మెల్సీ పదవిని సోము వీర్రాజుకు ఇచ్చింది. ఇపుడు పాకా వెంకట సత్యనారాయణకు పెద్దల సభలో అవకాశం ఇవ్వడం ద్వారా బీజేపీ తమది క్యాడర్ బేస్డ్ పార్టీ అని గట్టిగా చాటుకుంది అని అంటున్నారు.