Begin typing your search above and press return to search.

అభినందన్‌ ను బంధించిన పాక్‌ మేజర్‌ ను చంపిన ఉగ్రవాదులు!

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది వంటి కొటేషన్ చెప్పే ఘటన ఒకటి తాజాగా పాకిస్థాన్ లో జరిగింది.

By:  Tupaki Desk   |   25 Jun 2025 8:00 PM IST
అభినందన్‌  ను బంధించిన పాక్‌  మేజర్‌  ను చంపిన ఉగ్రవాదులు!
X

పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది వంటి కొటేషన్ చెప్పే ఘటన ఒకటి తాజాగా పాకిస్థాన్ లో జరిగింది. భారత్ పైకి ఉగ్రవాదులను పెంచి పోషించి వదులుతున్న పాక్ కు తాజాగా ఆ ఉగ్రవాదులే షాకిచ్చిన ఓ ఘటన తెరపైకి వచ్చింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ అభినందన్ వర్థమాన్ కావడం గమనార్హం.

అవును... భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ కు సంబంధించిన విషయం అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2019లో ఆయనను పాకిస్థాన్‌ సైన్యం బంధించింది. ఆ సమయంలో అభినందన్‌ వర్థమాన్ ను పట్టుకోవడంలో పాకిస్థానీ మేజర్ మోయిజ్ అబ్బాస్ షా కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు.

అయితే తాజాగా ఆ పాక్ మేజర్ ను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు హతమార్చినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ లో పనిచేస్తున్న అబ్బాస్ షా.. ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌ చేపడుతున్న సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయినట్లు పాక్‌ సైన్యం వెల్లడించింది.

ఈ సందర్భంగా... పాకిస్తాన్‌ లోని దక్షిణ వజీరిస్తాన్ జిల్లాలో నిఘా ఆధారిత ఆపరేషన్ లో భద్రతా దళాలు 11 మంది ఉగ్రవాదులను హతమార్చగా, ఆ ఎదురు కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. వారిలో అబ్బాస్ షా ఒకరు!

కాగా... 2019లో బాలాకోట్‌ ఘటన జరిగిన మరుసటిరోజు పాక్‌ వైమానిక దళం ఎఫ్‌-16 విమానంతో భారత్‌ పై దాడికి యత్నించగా.. వింగ్‌ కమాండర్‌ గా ఉన్న అభినందన్‌.. మిగ్‌-21 విమానంతో వెంటాడి దాన్ని నేలకూల్చారు. అదే సమయంలో ఆయన విమానం కూడా కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో కిందకు దూకగా అది పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లింది.

దీంతో అతడిని పాక్‌ జవాన్లు అదుపులోకి తీసుకొన్నారు. చిత్రహింసలు పెట్టారు! ఆ సమయంలో.. అభినందన్‌ ను తిరిగి అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయస్థాయిలో పాక్‌ పై ఒత్తిడి పెరిగింది. దీంతో పట్టుబడిన 58 గంటల తర్వాత పాక్‌ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత్‌ కు అప్పగించింది. ఈ క్రమంలో.. 2021లో ప్రభుత్వం ఆయనను 'వీర్‌ చక్ర' పురస్కారంతో సత్కరించింది.