Begin typing your search above and press return to search.

కొత్త కల్చర్: పెయిడ్ సర్వేలు..నిజమెంత?

రాజకీయపార్టీలు అనుసరిస్తున్న కొత్త వ్కూహం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేసిందన్న మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 3:30 PM GMT
కొత్త కల్చర్: పెయిడ్ సర్వేలు..నిజమెంత?
X

కీలకమైన ఎన్నికల వేళ.. ప్రజల అభిప్రాయమే పార్టీల గెలుపు ఓటముల్ని డిసైడ్ చేస్తున్న నేపథ్యంలో..వారి అభిప్రాయాల్ని మార్చేందుకు.. వారిని ప్రభావితం చేసేందుకు వీలుగా రాజకీయపార్టీలు అనుసరిస్తున్న కొత్త వ్కూహం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేసిందన్న మాట వినిపిస్తోంది. నిజాన్ని అబద్దంగా.. అబద్ధాన్ని నిజంగా మార్చేసి.. మార్ఫింగ్ చేసే మాయాజాలం ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఉన్న సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా కొత్త దరిద్రాన్ని జనం మీద రద్దేందుకు పక్కా ప్లానింగ్ జరుగుతోంది.

ఇంతవరకు పెయిడ్ ఆర్టికల్స్.. పెయిడ్ గెస్టులు.. పెయిడ్ న్యూస్.. ఇలా ఎన్నో దరిద్రాల్ని తీసుకొచ్చిన పార్టీలు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంగా పెయిడ్ సర్వేల పేరుతో చేస్తున్న విన్యాసాలు అన్ని ఇన్ని కావు. మీడియా విస్త్రతి పెరగటం.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కోసం కొత్త ఎత్తులు వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా అటు అధికార పక్షం.. ఇటు విపక్షాలు పెయిడ్ సర్వేల మీద పడుతున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో వెలువడిన ఎన్నికల సర్వేలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలు విపక్షాలకు గెలుపు అవకాశాల్ని కట్టబెడుతుంటే.. మరోవైపు మరికొన్ని సర్వే సంస్థలు తెలంగాణ అధికారపక్షానికి గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. పేరున్న సంస్థలతో పాటు.. పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని సర్వే సంస్థల మీద ఆధారపడి.. సర్వే రిపోర్టుల పేరుతో చేస్తున్న హడావుడి అంతకంతకూ ఎక్కువ అవుతుందని చెబుతన్నారు.

ఈ మధ్యన విడుదలైన ఒక సర్వేకు సంబంధించి రాజకీయ వర్గాల్లోనూ.. పాత్రికేయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. భారీ శాంపిల్ తో తాము వేస్తున్న అంచనా నిజం కావటం ఖాయమన్న మాటను గొప్పగా చెప్పటం.. తమ అనుకూల మీడియాతోపాటు.. సోషల్ మీడియాలోనూ ఈ వివరాల్ని ప్రచారం చేస్తూ.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ను పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెర మీదకు వచ్చే సర్వేల్లో చాలావరకు పెయిడ్ సర్వేలని.. వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ ఎన్నికల్లో ఈ దరిద్రం అంతకంతకూ ఎక్కువగా ఉండటం ఖాయమని చెబుతున్నారు.