"హిందువుల ప్రభుత్వం వచ్చాక నేనే హోం మంత్రి"
తెలంగాణలో హిందువుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తానే హోం మంత్రి అవుతానని.. అప్పుడు ఎవరెవరి సమస్యలు ఎలా పరిష్కరించాలో .. అలానే పరిష్కరిస్తానని వ్యాఖ్యానించారు
By: Garuda Media | 18 March 2026 8:08 PM ISTబీజేపీ శాసన సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో హిందువుల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తానే హోం మంత్రి అవుతానని.. అప్పుడు ఎవరెవరి సమస్యలు ఎలా పరిష్కరించాలో .. అలానే పరిష్కరిస్తానని వ్యాఖ్యానించారు. తాజాగా అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన రాకేష్ రెడ్డి.. బీఆర్ ఎస్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుకు ఎదురు పడ్డారు.
ఈ సందర్భంగా తొలుత హరీషే.. రాకేష్‌ను పలకరించారు. ``ఏం తమ్ముడూ ఎలా ఉన్నావ్`` అని హరీష్ రావు అన్నారు. దీనికి నవ్వుతూనే బాగానే ఉన్నామని చెప్పిన రాకేష్. త్వరలోనే రాష్ట్రంలో హిందువుల ప్రభుత్వం వస్తుందని వ్యాఖ్యానించారు. 2029లో ఏర్పడేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. అప్పుడు తాను హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. అంతేకాదు.. ముందు వరుసలో నువ్వే కూర్చోవాలన్నా.. అని హరీష్‌రావుకు ఆఫర్ ఇచ్చారు.
దీనికి హరీష్‌రావు కూడా నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. `ఆల్ దిబెస్ట్ బ్రదర్` అని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం.. మీడియా రాకేష్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా కూడా రాకేష్ ఇదే మాట చెప్పారు. త్వరలోనే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందన్నారు. తానే హోం శాఖను తీసుకుంటానని చెప్పారు. అప్పుడు ఎవరెవరి లెక్కలు ఎలా సరిచేయాలో అలానే సరిచేస్తానని వ్యాఖ్యానించారు. ఆ లెక్కలు ఏంటనేది తర్వాత చెబుతానని అనడం కొసమెరుపు.
ఇదిలావుంటే.. ఆర్మూరు నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్న రాకేష్‌రెడ్డి.. బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. కేంద్రంలోని పెద్దలతోనూ ఆయనకు సంబంధాలు ఉన్నాయని అంటారు. గత 2023లో ఆయన తన టికెట్ కోసం.. కేంద్రం దగ్గరే పోరాడి సాధించుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
