ఉగ్రవాదిని గుర్తించడంలో ఉపయోగపడిన టెక్నాలజీ.. ఎలా అంటే..!
అవును... ఉగ్ర అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు సాంకేతికత సాయం తీసుకుంటున్నారు.
By: Tupaki Desk | 21 July 2025 11:17 AM ISTజమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఉగ్రవేటను భద్రతా దళాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి సరిహద్దు వెంబడి, ప్రధానంగా జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు అవిరామంగా జరుగుతూనే ఉంది. ఈ సమయంలో ఉగ్రవాదులను, ఉగ్ర అనుమానితులను పట్టుకునేందుకు టెక్నాలజీ సహాయాన్ని తీసుకుంటున్నారు.. ఈ క్రమంలో తాజాగా సక్సెస్ అయ్యారు.
అవును... ఉగ్ర అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు సాంకేతికత సాయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏర్పాటు చేసిన ముఖ గుర్తింపు వ్యవస్థ (ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్) ద్వారా అనంత్ నాగ్ పోలీసులు ఆదివారం ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. విచారణలో అతడిపై “ఉపా” (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక) చట్టం కింద పలు కేసులు నమోదైనట్లు తెలిసింది!
గనిష్ బాల్ లోని ఎక్స్-రే పాయింట్ వద్ద జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏర్పాటు చేసిన ముఖ గుర్తింపు వ్యవస్థ ద్వారా అనుమానితుడిని గుర్తించిన వెంటనే అదుపులోకి తీసుకుని, తదుపరి ధృవీకరణ కోసం పహల్గాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ విచారణలోనే అతడిపై ఇప్పటికే ‘ఉపా’ తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద పలు కేసులు నమోదైనట్లు తెలిసిందని చెబుతున్నారు.
నిందితుడిని ద్రాంగ్ బల్ పాంపోర్ ప్రాంతానికి చెందిన మునీబ్ ముస్తాఖ్ షేక్ గా గుర్తించారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... నిందితుడిని త్వరగా గుర్తించడం, పట్టుకోవడం భద్రతను పెంపొందించడం, శాంతిభద్రతలను కాపాడటంలో అధునాతన నిఘా సాంకేతికతల ప్రభావాన్ని ఈ ఘటన హైలైట్ చేస్తుందని అంటున్నారు.
