పహల్గాం ఉగ్రదాడి కేసులో బిగ్ అప్ డేట్.. ఇద్దరు అరెస్ట్!
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో గల బైసరన్ లోయలో సరిగ్గా రెండు నెలల క్రితం అత్యంత ఘోరమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jun 2025 1:01 PM ISTజమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో గల బైసరన్ లోయలో సరిగ్గా రెండు నెలల క్రితం అత్యంత ఘోరమైన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పహల్గాం లోయలోని పర్యాటకులపై ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో.. 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసు దర్యాప్తులో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... పహల్గాం ఉగ్రదాడి జరిగి సరిగ్గా నేటికి రెండు నెలలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 22న ఎంతో ప్రకృతి ఒడిలో ఆనందిస్తున్న పర్యాటకులపై ఉగ్రమూకలు తుపాకులతో విరుచుకుపడ్డాయి. దీంతో... ఈ ఘటనలు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ ని చేపట్టింది. దీంతో.. ఉగ్రమూకలను, వారికి ఆశ్రయం ఇచ్చిన పాక్ ను గడగడలాడించింది.
మరోవైపు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా.. పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం, రవాణా సహాయం చేశారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. వారిని పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్ గా గుర్తించారు.
ఈ సందర్భంగా... "పహల్గాం ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తులో ఒక పెద్ద పురోగతిలో.. 26 మంది అమాయక పర్యాటకులను చంపి, 16 మందిని తీవ్రంగా గాయపరిచిన భయంకరమైన దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది” అని ఎన్.ఐ.ఏ. ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదే సమయంలో... "పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి కారణమైన ముగ్గురు ముష్కరులకు ఆశ్రయం కల్పించిన పర్వీజ్, బషీర్ ను అరెస్టు చేశాం.. వారిని ప్రశ్నించగా.. ముగ్గురు ఉగ్రవాదుల పేర్లను బయటపెట్టారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు పాక్ దేశీయులు.. దాడి చేసినవారికి లష్కరే తొయ్యిబాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు" అని తెలిపింది.
ఇదే క్రమంలో.. "ఆ ఇద్దరు వ్యక్తులు ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయంతో పాటు రవాణా సహాయాన్ని అందించారు.. వారు ఆ దురదృష్టకరమైన మధ్యాహ్నం, పర్యాటకులను వారి మతం ఆధారంగా గుర్తించి మరీ ఎంపిక చేసి చంపారు.. ఇది ఇప్పటివరకు జరిగిన అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడులలో ఒకటి" అని ఎన్.ఐ.ఏ. వివరించింది.
