సిందూరం చెరిగిన ఆ ఆడబిడ్డను కలవనున్న మోడీ
తాజాగా ఆయన కుటుంబం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తమను కలవనున్నట్లుగా తెలిపారు.
By: Tupaki Desk | 25 May 2025 10:25 AM ISTవిహారయాత్ర కోసం పహల్గాం వచ్చిన వారి నుదిట సిందూరం చెరిగిపోవటం.. తమ కుటుంబ సభ్యుల కళ్ల ముందే ఇంటి పెద్ద మతం అడిగి మరీ కాల్చేసిన దారుణ ఉదంతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఉగ్రదాడిలో పెద్ద ఎత్తున అమాయకులు మరణించిన సంగతి తెలిసిందే. తన భర్తను విడిచి పెట్టాలని కోరిన మహిళలతో ఉగ్రవాదులు.. వెళ్లి మోడీకి చెప్పుకో అన్న మాటను ప్రధాని నరేంద్ర మోడీ ఎంత సీరియస్ గా తీసుకున్నారన్న విషయం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేశాయి.
ఇలా ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయిన బాధితురాళ్లలో శుభమ్ ద్వివేది ఒకరు. హనీమూన్ కోసం కశ్మీర్ కు వెళ్లిన ఈ యూపీ వ్యాపారి ప్రాణాలు కోల్పోవటం యావత్ భారతాన్ని కదిలించి వేసింది. తాజాగా ఆయన కుటుంబం మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తమను కలవనున్నట్లుగా తెలిపారు. పహల్గాం ఉగ్ర ఘటనలో మొదటి తూటా తన భర్త ప్రాణాన్నే బలి తీసుకుందని.. అందుకు ఆయనకు అమరవీరుడి హోదాను ఇవ్వాలని శుభమ్ ద్వివేది సతీమణి ఇషానాయ్ ద్వివేది కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ డేట్ ఫిక్స్ కావటం విశేషం.
ఈ నెల 30న (శుక్రవారం) కాన్పూరు ఎంపీ రమేశ్ అవస్థి ఆఫీసులో ప్రధాని నరేంద్ర మోడీ తమను కలవనున్నట్లుగా పేర్కొన్నారు. ఉగ్రవాదులు తన భర్తను బలి తీసుకున్న ఉదంతంపై మాట్లాడుతూ.. తాము హిందువులం కాబట్టే ఉగ్రవాదులు తన భర్తను కాల్చి చంపారన్న ఆమె.. అతడి త్యాగాన్ని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తన భర్తకు అమరవీరుడి హోదాను ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీతోనే నేరుగా చెబుతానని పేర్కొన్నారు. తాను కోరుతున్న అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఇషానాయ్ ద్వివేది వ్యక్తం చేస్తున్నారు.
యూపీలోని కాన్పూరుకు చెందిన శుభమ్ ద్వివేది ఫిబ్రవరి 12న పెళ్లైంది. వ్రత్తిరీత్యా బిజీగా ఉండే ఆయన భార్యతో కలిసి కశ్మీర్ కు హనీమూన్ కోసం వచ్చారు. వారు బైసరన్ లోయలో సరదాగా విహరిస్తుండగా.. వారిని ఉగ్రవాదులు చుట్టుముట్టటం.. పేరు ముందు ద్వివేది ఉండటంతో అతడ్ని చంపేశారు. ఈ సందర్భంగా తన భర్తతో పాటు తనను కూడా చంపాలని అడిగితే తాము మహిళల్ని చంపమని.. ఈ దాడి గురించి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పుకొమ్మన్నారంటూ ఆమె అప్పట్లో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఉగ్రదాడిలో మొత్తం 27 మంది మరణించారు. ఈ మాటలకు నిదర్శనంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ లోని ఉగ్రశిబిరాల్ని ధ్వంసం చేయటం.. వందకు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చిన సంగతి తెలిసిందే.
