పాక్ మాజీ మంత్రి కొత్త రకం మేకపోతు గాంభీర్యం!
జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
By: Tupaki Desk | 24 April 2025 12:06 PM ISTజమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కాల్పుల్లో 26 మంది మృతి చెందారు. ఈ దాడిని అత్యంత తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. దౌత్యపరంగా సంచలన నిర్ణయాలే తీసుకుంది. అంతకంటే ముందు పాక్ మాజీ మంత్రి ఎక్స్ వేదికగా రెండు పోస్టులు పెట్టారు.
అవును... పహల్గాంలో ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఇలా దాడి జరిగిన కొద్దిసేపటికే.. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ప్రతినిధి సంస్థ టీ.ఆర్.ఎఫ్. బాధ్యత వహించింది. మరోపక్క దాడి వెనుక ఉన్నట్లు భావిస్తున్న ముగ్గురు అనుమానితుల స్కెచ్ లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి.. వీరంతా పాకిస్థాన్ జాతీయులే!
ఈ సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా.. దాడి చెసిన వారిని నిర్మూలించడంతోనే భారత్ ఆగదని.. సరిహద్దు అవతల నుంచి కుట్రను రూపొందించిన వారిని లక్ష్యంగా చేసుకుంటుందని పరోక్షంగా ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వారికి వార్నింగ్ ఇస్తూ ప్రతిజ్ఞ చేశారు. వారిని వెంటాడి చంపుతామని అన్నారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్ పార్టీ సీనియర్ నాయకుడు చౌదరి ఫవాద్ హుస్సేన్ అన్నారు. ఈ సమయంలో ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పాక్ రాజకీయ పార్టీలన్నీ కలిసి ఉంటామని చెబుతూ.. భారత్ యుద్ధ చర్యలు తీసుకోదని భావిస్తున్నట్లు చెబుతూ.. రెండు పోస్టులు పెట్టారు.
ఇందులో భాగంగా... "పాకిస్థాన్ రాజకీయంగా విడిపోయింది కానీ.. మనం ఒక దేశంగా ఐక్యంగా ఉన్నాము. భారత్ మనపై దాడి చేసినా, బెదిరించినా.. అన్ని గ్రూపులు (పీఎమెల్-ఎన్, పీపీపీ, పీటీఐ, జేయూఐ)... మన మాతృభూమిని రక్షించుకోవడానికి పాక్ జెండా కింద కలిసి ర్యాలీ చేస్తారు" అని స్పందించారు.
ఇదే సమయంలో... ఉగ్రదాడి అనంతరం భారత్ లో జరుగుతున్న పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారో ఏమో కానీ.. మోడీ సర్కార్ నుంచి సమ్యమనం ఆశిస్తూ మరో పోస్ట్ పెట్టడం గమనార్హం.
ఇందులో భాగంగా... “భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించింది.. కూల్ హెడ్స్ గెలుస్తాయని, అధికారులు మీడియా ఆజ్యం పోసిన యుద్ధానికి లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టరని ఆశిద్దాం" అని రాసుకొచ్చారు. దీంతో.. లోపల భయం పెట్టుకుని పైకి ఇలాంటి కబుర్లు చెప్పడాన్ని మేకపోతు గాంభీర్యం అంటారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... ఈ పాక్ మాజీ మంత్రి ట్వీట్లలో ఎక్కడా పహల్గాం ఉగ్రదాడి గురించి నేరుగా ప్రస్థావించడం కానీ.. ఆ ఉగ్రదాడిని ఖండించడం కానీ.. ఇది పాక్ చర్య కాదు అని కానీ చెప్పకపోవడం గమనార్హం.
