Begin typing your search above and press return to search.

విద్యార్థిగా వెళ్లి టెర్రరిస్ట్ గా తిరిగొచ్చాడు.. ఉగ్రవాది అదిల్ బ్యాగ్రౌండ్ ఇదీ

సుమారు 20 ఏళ్ల వయసున్న ఆదిల్ థోకర్, అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా సమీపంలోని గురీ అనే కుగ్రామంలో పుట్టి పెరిగాడు.

By:  Tupaki Desk   |   27 April 2025 9:33 AM
విద్యార్థిగా వెళ్లి టెర్రరిస్ట్ గా తిరిగొచ్చాడు.. ఉగ్రవాది అదిల్ బ్యాగ్రౌండ్ ఇదీ
X

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న ఆదిల్ హుస్సేన్ థోకర్ కథ ఇది. మన దేశంలో జన్మించి, పెరిగి.. శత్రు దేశంతో చేతులు కలిపి, అక్కడ ఉగ్రవాద శిక్షణ పొంది తిరిగి వచ్చిన కిరాతకుడు ఇతను. పహల్గాంలో అమాయక పర్యాటకులపై మారణహోమం సృష్టించడంలో ఇతడి పాత్ర కీలకమని నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సుమారు 20 ఏళ్ల వయసున్న ఆదిల్ థోకర్, అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహారా సమీపంలోని గురీ అనే కుగ్రామంలో పుట్టి పెరిగాడు. చిన్న వయసులోనే నిషేధిత ఉగ్ర సంస్థల పట్ల ఆకర్షితుడై, టీనేజ్‌లోనే పలువురు ఉగ్రవాదులకు చేరువయ్యాడు. 2018లో దక్షిణ కశ్మీర్‌లో జరిగిన ఒక ఉగ్రవాది అంతిమయాత్రలో కూడా పాల్గొన్నాడు.

అదే ఏడాది, ఆదిల్ పాకిస్థాన్ వెళ్లేందుకు విద్యార్థి వీసా సంపాదించి, వాఘా సరిహద్దు ద్వారా ఆ దేశంలోకి ప్రవేశించాడు. వాస్తవానికి అప్పటికే ఇతనిలో ఉగ్రవాద భావజాలం బలంగా పాతుకుపోయింది. పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత ఇతను దాదాపు 8 నెలల పాటు ఎవరితోనూ, కనీసం కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు లేకుండా పోయాడు. ఇతని కదలికలపై నిఘా పెట్టే ఏజెన్సీలు కూడా ఆచూకీ గుర్తించలేకపోయాయి.

అజ్ఞాతంలోకి వెళ్లిన ఆదిల్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలో చేరినట్లు తర్వాత గూఢచార వర్గాలు గుర్తించాయి. అక్కడ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'లో తీవ్ర స్థాయి శిక్షణ పొంది, పలువురు అగ్ర కమాండర్లతో కలిసి పని చేసినట్లు నిఘా సంస్థలకు సమాచారం అందింది. శిక్షణ పూర్తి చేసుకుని, కొంతకాలం పనిచేసిన అనంతరం, 2024 చివరిలో ఆదిల్ తిరిగి భారత్‌కు వచ్చాడు.

అయితే, ఈసారి ఇతను అధికారిక మార్గాల్లో కాకుండా, పూంఛ్-రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (LoC) వెంట ఉన్న దట్టమైన అటవీ, కొండ ప్రాంతాల గుండా అక్రమంగా దేశంలోకి చొరబడ్డాడు. అంతేకాకుండా, తనతో పాటు పహల్గాం దాడిలో పాలుపంచుకున్న సులేమాన్ సహా మరికొంత మంది పాకిస్థానీ ఉగ్రవాదులను కూడా తీసుకువచ్చినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

సరిహద్దు దాటి వచ్చిన తర్వాత, ఆదిల్ నేరుగా అనంత్‌నాగ్‌లోని తన స్వస్థలానికి చేరుకుని, భద్రతా బలగాలకు దొరక్కుండా అండర్‌గ్రౌండ్‌లో దాక్కున్నాడు. అక్కడి స్థానిక ఉగ్రవాద సెల్స్‌తో నిరంతర సంప్రదింపులు జరుపుతూ, పహల్గాం ఉగ్రదాడికి సంబంధించిన పూర్తి ప్రణాళికను రచించాడు. దేశంలో జరిపే దాడి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మొదట రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతాలను ఎంచుకోవాలని భావించినా, బైసరన్ లోయ అయితే దట్టమైన అటవీ కారణంగా తప్పించుకోవడానికి సులువుగా ఉంటుందని, ఇది భద్రతా బలగాలకు సవాలు విసురుతుందని దాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఏప్రిల్ 22వ తేదీన, పగలు సుమారు 2 గంటల సమయంలో, ఆదిల్ మరికొంత మంది ఉగ్రవాదులతో కలిసి దట్టమైన పైన్ అడవుల గుండా బైసరన్ లోయలోకి చేరుకున్నాడు. అక్కడ ఉన్న పర్యాటకులను చుట్టుముట్టి, వారిని మతపరంగా విభజించే ప్రయత్నం చేశాడు. పర్యాటకులను ఆపి, మీరు హిందువులా లేక ముస్లింలా అని అడిగి, పురుషుల ప్యాంట్లను విప్పి తనిఖీ చేశారు. ముస్లింలుగా గుర్తించిన వారిని వదిలివేసి, హిందువులపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు.

ఈ విధంగా, ఒకప్పుడు విద్యార్థిగా దేశం విడిచి వెళ్లిన ఆదిల్ అహ్మద్, ఉగ్రవాద శిక్షణ పొంది, అత్యంత క్రూరమైన రీతిలో తిరిగి వచ్చి, పహల్గాంలో మారణహోమానికి పాల్పడటంలో కీలక పాత్ర పోషించాడు.